
మది నిండా ఆనందం
►క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర
► లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం
► సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం
► మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాంత్ శర్మ
పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే...
నచ్చిన సెల్‌ఫోన్ నాన్న కొనిస్తే...
మెచ్చిన హీరో సినిమా మార్నింగ్ షో చూస్తే...
ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌కు వెయ్యి లైక్‌లు వస్తే...
ఎంత ఆనందం కలుగుతుందో...
భారత క్రికెట్ అభిమానికీ అంత ఆనందం కలిగింది. ఇది నిజమేనా..! అని ఆశ్చర్యపోయేలా
ధోనిసేన మురిపించింది.
క్రికెట్‌ను ఊపిరిగా శ్వాసించే అభిమానులకు ఇదో సంబరం. ఈ ఆటను మతంలా భావించే దేశానికి ఇదో పెద్ద విజయం. క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం టెస్టు గెలిచిన తర్వాత... సచిన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాని విజయం... ఇన్నాళ్లకు దక్కింది. విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సంతోష సమయంలో... భారత జట్టు ఈ ప్రతిష్టాత్మక మైదానంలో ఇంగ్లండ్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. పేసర్ ఇషాంత్ శర్మ (7/74) సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు.
లండన్: అద్భుతం.. మహాద్భుతం. అవును.. భారత జట్టు మహాద్భుతమే సృష్టించింది. లార్డ్స్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది. తొలి నాలుగు రోజులు ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన రెండో టెస్టు.. చివరి రోజు ఇషాంత్ శర్మ బెబ్బులిలా విజృంభించడంతో ఏకపక్షమైంది. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ నిప్పులు కురిపించిన ఇషాంత్ బంతులకు ఇంగ్లండ్ కుదేలైంది. ఆట ఆఖరి రోజు రెండో సెషన్‌లోనే 223 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో 95 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయం నమోదు చేసిన భారత్.. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అద్భుత విజయాన్నందించిన ఇషాంత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 342 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 7; కుక్ (సి) ధోని (బి) ఇషాంత్ 22; బాలెన్స్ (సి) ధోని (బి) షమీ 27; బెల్ (బి) ఇషాంత్ 1; రూట్ (సి) బిన్ని (బి) ఇషాంత్ 66; అలీ (సి) పుజారా (బి) ఇషాంత్ 39; ప్రయర్ (సి) విజయ్ (బి) ఇషాంత్ 12; స్టోక్స్ (సి) పుజారా (బి) ఇషాంత్ 0; బ్రాడ్ (సి) ధోని (బి) ఇషాంత్ 8; ప్లంకెట్ నాటౌట్ 7; అండర్సన్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 32, మొత్తం: (88.2 ఓవర్లలో): 223 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-12, 2-70, 3-71, 4-72, 5-173, 6-198, 7-201, 8-201, 9-216, 10-223.
బౌలింగ్: భువనేశ్వర్ 16-7-21-0; షమీ 11-3-33-1; ఇషాంత్ 23-6-74-7; జడేజా 32.2-7-53-1; విజయ్ 4-1-11-0; ధావన్ 2-0-2-0.
సెషన్-1: ఆఖరి బంతితో ఆరంభం
319 పరుగుల లక్ష్యంతో.. ఓవర్‌నైట్ స్కోరు 105/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రూట్, అలీ ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకుండా ఆచితూచి ఆడారు. తొలుత ఇషాంత్, జడేజాలతో బౌలింగ్ చేయించిన భారత కెప్టెన్ ధోని.. ఆ తరువాత వ్యూహం మార్చి భువనేశ్వర్, షమీలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పార్ట్‌టైమర్ ధావన్ చేతికీ బంతినిచ్చాడు. అయినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ క్రీజును అంటిపెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు.
దీంతో ఇన్నింగ్స్ 70వ ఓవర్లో స్కోరు 150 మార్క్‌కు చేరింది. లంచ్‌కు ముందు ఇషాంత్ మళ్లీ బంతి పట్టగా.. ఒకే ఓవర్లో రూట్ మూడు ఫోర్లు సాధించి దూకుడు ప్రదర్శించాడు. అయితే ఇషాంత్ వేసిన సెషన్ చివరి ఓవర్, చివరి బంతి ఇంగ్లండ్ పతనానికి నాంది పలుకుతూ అలీ (147 బంతుల్లో 39; 5 ఫోర్లు) వికెట్‌ను బలిగొంది. దీంతో 101 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరదించుతూ భారత్ లంచ్‌కు వెళ్లింది.
ఓవర్లు: 30; పరుగులు: 68; వికెట్లు: 1
సెషన్-2: ఇంగ్లండ్ పేకమేడలా..!
తిరిగి మ్యాచ్ ఆరంభమయ్యాక ఎదురుదాడికి దిగే వ్యూహం అవలంబించిన ఇంగ్లండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇషాంత్ వేసిన ఊరించే బంతుల్ని పుల్‌షాట్లుగా మలిచే ప్రయత్నంలో బ్యాట్స్‌మెన్ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలుత ఇన్నింగ్స్ 80వ ఓవర్లో పుల్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ప్రయర్ (12) డీప్ మిడ్‌వికెట్‌లో విజయ్ చేతికి చిక్కగా, ఇషాంత్ మరుసటి ఓవర్లో స్టోక్స్ (0), రూట్ (146 బంతుల్లో 66; 7 ఫోర్లు)లు అతణ్ని అనుసరించారు. స్టోక్స్ వరుసగా నాలుగో డకౌట్ నమోదు చేసుకోగా, రూట్ నియంత్రణ లేని షాట్‌తో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
దీంతో భారత్ విజయం ఖాయమైంది. మరో మూడు ఓవర్లు గడిచాయో లేదో.. ఇషాంత్ నమ్మశక్యం కాని రీతిలో ధోని క్యాచ్ ద్వారా బ్రాడ్ (8)ను వెనక్కిపంపి ఏడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఏడు పరుగులు జతయ్యాక.. అండర్సన్ (2)ను జడేజా రనౌట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం పూర్తయింది. 50 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ శిబిరంలో విషాదం చోటుచేసుకుంది. రిజర్వు ఆటగాళ్లతో సహా భారత బృందం మైదానంలోకి వచ్చి ఆనందాన్ని పంచుకుంది.
ఓవర్లు: 12.2; పరుగులు: 60; వికెట్లు: 5
మలుపు తిరిగిందిక్కడే..!
ఇంగ్లండ్ స్కోరు 173/4. ఐదో వికెట్‌కు 101 పరుగులు నమోదయ్యాయి. అర్ధసెంచరీతో రూట్, అతనికి అండగా మొయిన్ అలీ క్రీజులో పాతుకుపోయారు. విజయానికి మరో 146 పరుగులు కావాల్సివుంది. దీంతో ఇంగ్లండ్ శిబిరంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కానీ, అప్పుడే జరిగింది అద్భుతం. లంచ్‌కు వెళ్లేముందు చివరి బంతిని ఇషాంత్ జూలు విదిల్చిన సింహంలా విజృంభిస్తూ సంధించాడు. దీంతో అనూహ్యంగా ముఖం మీదికి దూసుకొచ్చిన బంతికి అలీ వద్ద సమాధానమే లేకపోయింది. ముఖానికి బ్యాట్‌ను అడ్డం పెట్టి పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. అంతే... మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.
‘లంబూ’ పంబ రేపాడు!
ఎప్పుడో ఆరేళ్ల క్రితం...పెర్త్ మైదానంలో రికీపాంటింగ్‌లాంటి దిగ్గజాన్ని వణికించిన అద్భుతమైన స్పెల్ అది...ఇషాంత్ శర్మ అంటే అందరికీ అదే గుర్తొస్తుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ఉన్నా...అతని కెరీర్‌లో అద్భుతాలు పెద్దగా లేవు. 50కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా ఒక సీనియర్‌గా జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించే స్థాయిలో లేడంటూ ఇషాంత్‌పై విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2011లో వెస్టిండీస్‌లో సిరీస్ నెగ్గినపుడు 22 వికెట్లతో ఇషాంత్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత అతడి బౌలింగ్ మరీ నాసిరకంగా తయారైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఇషాంత్ మారాడు.
ఇక ఆట మారకుంటే కష్టం అనుకున్నాడు. అందుకే తనకు ఓనమాలు నేర్పిన కోచ్ శ్రవణ్ కుమార్ దగ్గరికి మళ్లీ వెళ్లాడు. తన బౌలింగ్ శైలిని మార్చుకున్నాడు. వేగం ధ్యాసలో పడి కోల్పోయిన లైన్ అండ్ లెంగ్త్‌ను అంది పుచ్చుకున్నాడు. దాని ఫలితం ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ సిరీస్‌లో కనిపించింది. రెండు టెస్టుల్లో కలిపి 15 వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లలో నోబాల్స్ సమస్య...తొలి టెస్టులో మూడే వికెట్లు...రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ పడలేదు! ఇలాంటి స్థితిలో అతను రెండో ఇన్నింగ్స్‌లో తన విలువేంటో చూపించాడు. 2011లో ఘోర పరాజయం బాధను అనుభవించిన లంబూ... ఈసారి తాను ఊరట చెందడంతో పాటు దేశంలో అందరిలో సంతోషాన్ని నింపాడు.
ప్రధాని అభినందనలు
‘భారత జట్టు చాలా బాగా ఆడింది. లార్డ్స్‌లో అద్భుత విజయం సాధించినందుకు నా అభినందనలు. ఈ ప్రదర్శనపై మేం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నాం’ - నరేంద్ర మోడి
ఇంగ్లండ్‌లో మా ఆటగాళ్లు చాలా మంది టెస్టు క్రికెట్ ఆడలేదు. సమీప భవిష్యత్తులో నేను లార్డ్స్‌లో టెస్టు ఆడకపోవచ్చు. కాబట్టి జట్టుకే కాకుండా వ్యక్తిగతంగా ఈ విజయం ఎంతో చిరస్మరణీయం. అందరూ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. లంచ్‌కు ముందు ఆఖరి ఓవర్లో షార్ట్ బంతులు వేయమని నేనే ఇషాంత్‌పై ఒత్తిడి తెచ్చాను. షార్ట్ బంతులు విసిరి డీప్‌లో ఫీల్డర్ ఉంచిన మా వ్యూహం ఫలించింది. గతంలో విదేశాల్లో ఓడినప్పటితో పోలిస్తే ఈ జట్టు పూర్తిగా కొత్తగా ఉంది. మా శ్రమకు దక్కిన ఫలితమిది.
- ధోని, భారత కెప్టెన్
జట్టు పరిస్థితి మార్చేందుకు నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా నేను పరుగులు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల నేను బాగా ఆడటం లేదనేది వాస్తవం. అయితే కెప్టెన్‌గా నేను పనికి రానని భావిస్తే దీనిపై తొందరగా నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు మేం గెలవాలంటే జట్టు మొత్తం ఎంతో పట్టుదల కనబర్చాలి. కుర్రాళ్లు బాగానే ఆడుతున్నా...సీనియర్ల వైఫల్యమే దెబ్బ తీస్తోంది. ఈ ఓటమి మమ్మల్ని ఎంతో బాధిస్తోంది.
- అలిస్టర్ కుక్, ఇంగ్లండ్ కెప్టెన్
కెప్టెన్ ధోని జట్టును నడిపించే తీరు, మమ్మల్ని ప్రోత్సహించే తీరు అద్భుతం. నేను తీసిన వికెట్లన్నీ నావి కావు. అవి మా కెప్టెన్‌కే దక్కాలి. నన్ను బౌన్సర్‌లు ప్రయత్నించమని అతనే ప్రోత్సహించాడు. మా జట్టు బ్యాట్స్‌మెన్‌కు కూడా ఈ విజయంలో కీలక పాత్ర ఉంది. రహానే తొలి ఇన్నింగ్స్ సెంచరీనే జట్టుకు కావాల్సిన ఊపునిచ్చింది.
- ఇషాంత్ శర్మ