ఇంటివాడైన ఇషాంత్
వారణాసి:టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఇంటివాడయ్యాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్-ఇషాంత్ల వివాహం శుక్రవారం జరిగింది. గత జూన్లో ఈ జోడికి నిశ్చితార్థం జరగ్గా, తాజాగా వారి వివాహం కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రికెటర్లు విచ్చేశారు. ప్రధానంగా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్లు వీరి వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ వివాహ కార్యక్రమానికి యువరాజ్ సింగ్ భార్య హజల్తో పాటు, ధోని భార్య సాక్షిలు హాజరు కాలేదు.గత కొన్ని రోజుల క్రితం యువరాజ్ సింగ్-హజల్కీచ్ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
వారణాసికి చెందిన ప్రతిమా సింగ్.. గతంలో భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టు తరపున అనేక మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించింది. దాంతో పాటు కెప్టెన్గా కూడా వ్యహరించింది. 2011లో ప్రతిమను బాస్కెట్ బాల్ ఈవెంట్లో ఇషాంత్ తొలిసారి చూశాడు. ఆ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఇషాంత్.. ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ రకంగా వారి ప్రేమకు మొదటి అడుగుపడింది.