
దీపక్ చాహర్, కృనాల్ పాండ్యా
వాషింగ్టన్ సుందర్ స్థానంలో కృనాల్ పాండ్యా, బుమ్రా స్థానంలో దీపక్ చాహర్‌లకు..
మంబై : ఇంగ్లండ్‌తో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌లు గాయాల కారణంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కృనాల్ పాండ్యా, బుమ్రా స్థానంలో దీపక్ చాహర్‌లకు అవకాశమిచ్చారు. సుందర్ వన్డే సిరీస్‌కు సైతం దూరం కావడంతో అతని స్థానంలో వన్డేలకు అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.
ఐర్లాండ్‌తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ వేలికి గాయం కాగా.. ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న భారత్-ఏ జట్టులో చాహర్, కృనాల్, అక్షర్‌లున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్-ఏ జట్లతో ట్రైసిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల్లో చాహర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో చాహర్, కృనాల్‌లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో అక్షర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేయగా.. కృనాల్, చహర్‌లు ఈ సిరీస్‌తో అరంగేట్రం చేయనున్నారు.