సిడ్నీ: ఒకవేళ భారత్ తమ దేశంలో పర్యటించకపోతే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ లబ్‌షేన్ అన్నాడు. టి20 ప్రపంచకప్‌కు ముందు అక్టోబర్‌లో ఆసీస్‌కు వెళ్లనున్న భారత్ తొలుత ముక్కోణపు టి20 సిరీస్ ఆడనుంది. అనంతరం డిసెంబర్–జనవరిలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌తో ఈ సుదీర్ఘ పర్యటన ముగుస్తుంది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల అక్కడి పర్యటనతో పాటు టి20 ప్రపంచకప్ కూడా సందిగ్ధంలో పడింది. దీనిపై లబ్‌షేన్ మాట్లాడుతూ ‘ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సిరీస్ జరగకపోతే పూర్తిగా దివాలా తీయడం ఖాయం. ఆటగాడిగా నాతోపాటు జట్టుకు, బోర్డుకు ఇది తీరని నష్టం చేస్తుంది’ అని అన్నాడు.
తమ దేశంలో క్రికెట్ వెలిగిపోవాలంటే భారత్‌తో సిరీస్ కచ్చితంగా జరగాల్సిందేనని చెప్పాడు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని... వన్డేల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే నైపుణ్యం సంపాదిస్తున్నట్లు ఈ బ్యాట్స్‌మన్ చెప్పాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో లబ్‌షేన్ మూడో ర్యాంకులో ఉన్నాడు. కరోనా నుంచి ఆస్ట్రేలియా గట్టెక్కిందని, ప్రపంచం, మిగతా దేశాలతో పోల్చితే కరోనా ప్రభావం తక్కువేనని అతను వివరించాడు. ఆసీస్ కట్టుదిట్టమైన చర్యలతో అక్కడ వైరస్ అదుపులోనే ఉంది. కేవలం 6,800 బాధితులే ఉండగా... 100లోపే మరణాలు సంభవించాయి.
Comments
Please login to add a commentAdd a comment