
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సేవలు ఇంకా అవసరమనే అంటున్నాడు మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ధోని అవసరం ఉందనే విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ గ్రహించాలంటూ కైఫ్ మద్దతుగా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి అవకాశం ఇవ్వకపోతే అది చాలా పెద్ద తప్పిదం అవుతుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో భారత క్రికెట్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌పై ఆధారపడటం తగదన్నాడు. ప్రధాన వికెట్ పాత్రను రాహుల్‌కు అప్పగించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు కల్పించి, రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉపయోగించుకోవాలన్నాడు. (ధోనికి ఎలా చోటిస్తారు..?)
‘ భవిష్యత్తులో రాహుల్ మన ప్రధాన వికెట్ కీపర్ అని అభిమానులు భావిస్తూ ఉండొచ్చు. కానీ నా దృష్టిలో రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్ మాత్రమే. ప్రధాన వికెట్ కీపర్ గాయపడిన సమయంలో రాహుల్‌ను కీపర్‌గా ఉపయోగించుకుంటేనే సమంజసం. అదే సమయంలో స్పెషలిస్టు కీపర్ గాయపడినప్పుడు రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించేలా మాత్రమే చూడాలి. ఐపీఎల్‌లో ధోని ప్రదర్శన కోసం ఇప్పటివరకూ చాలా కళ్లు నిరీక్షించాయి. ఆ ప్రదర్శన ఆధారంగా అతని వరల్డ్‌కప్ చాన్స్ ఆధారపడుతుందనే చాలా మంది ఆతృతగా ఎదురుచూశారు. కానీ నా ప్రకారం టీ20 వరల్డ్‌కప్ అనేది మిగతా లీగ్‌లకు భిన్నం. నేను ధోని ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతని ఫామ్‌ను అంచనా వేయలేను. ధోని ఎప్పటికీ గ్రేట్ బ్యాట్స్‌మన్.. అంతే కాదు ఇంకా చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఇంకా ఐపీఎల్ ఆడాలనుకుంటున్నాడంటే అతనిలో సత్తా తగ్గలేదని చెప్పకనే చెబుతున్నాడు. జట్టుకు విజయాలను అందించడంలో ధోనిలో స్పెషల్ టాలెంట్ ఉంది. ఒత్తిడిలో మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు ఎన్నో. అటువంటి ఆటగాడ్ని దూరం పెట్టడం మాత్రం ఎంతమాత్రం సరైనది కాదు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు ఇవ్వకపోతే అది తప్పుడు నిర్ణయమే అవుతుంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ తర్వాత ధోని పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. కొంతకాలం ధోని విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో రిషభ్ పంత్‌కు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించారు. కాగా, పంత్ పదే పదే విఫలం కావడంతో అతన్ని తప్పించి కేఎల్ రాహుల్ చేత కీపింగ్ చేయించారు. ఇక రాహుల్ కీపింగ్, బ్యాటింగ్‌లో మెరవడంతో పంత్ పక్కకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం పంత్‌ను పట్టించుకోని టీమిండియా మేనేజ్‌మెంట్ రాహుల్‌పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ధోని అవసరం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు టీమిండియా పెద్దలు. ఐపీఎల్‌లో జరిగి ధోని ఆకట్టుకుంటే మళ్లీ అతను హైలైట్ అయ్యేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడ్డా ఇంకా దానిపై స్పష్టత లేదు. అసలు ఈ సీజన్‌లో ఐపీఎల్ జరగదనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో ధోనిని ఏ ప్రాతిపదికన భారత జట్టులోకి తీసుకుంటారంటూ గంభీర్ లాంటి ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment