జహీర్ ఎంతో సహాయం చేశాడు: షమీ
భారత పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ తో ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే విశ్వాసం..
న్యూఢిల్లీ: భారత పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ తో ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే విశ్వాసం వ్యక్తం చేశాడు. బౌలింగ్ లో మెళుకవలు నేర్చుకోవడానికి భారత మాజీ పేసర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ ఎంతగానో సహాయం చేశాడని పేర్కొన్నాడు. జూన్ 1 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫిలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కడంతో మహ్మద్ షమీ మీడియాతో ఉద్వేగానికి లోనయ్యాడు. జహీర్ ఇచ్చిన సూచనలు బెస్ట్ బౌలర్ గా తీర్చిదిద్దాయని షమీ వ్యాఖ్యానించాడు.
సాధారణంగా మాజీ క్రికెటర్లతో మాట్లడినప్పుడే విలువైన సూచనలు లభిస్తాయని కానీ జహీర్ తో మాట్లడితే అంత కన్నా ఎక్కువ చిట్కాలు లభించాయని షమీ తెలిపాడు. దేశంలో చాల మంది క్రికెటర్లున్నారని వారందరికీ ఐపీఎల్ చక్కని వేదికా అని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టోర్నమెంట్ లో ఆడే ముందు ఐపీఎల్ లో ఆడిన 8-10 మ్యాచ్ లు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని షమీ పేర్కొన్నాడు.
'దాదాపు రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరమయ్యాను. ఈ రెండు సంవత్సరాలు నా బలం-ఫిట్ నెస్ పై దృష్టి సారించాను. నా బలహీనతలను సరిదిద్దుకున్నాను. దీనికోసం బరువు కూడా తగ్గాను. ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే నమ్మకం ఉంది. నా ప్రతిభ చాటలనే కసి మీద ఉన్నానని' మహ్మద్ షమీ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు. ఇక మహ్మద్ షమీ 2015 లో జరిగిన వరల్డ్ కప్ అనంతరం ఏ అంతర్జాతీయ వన్డే టోర్నమెంట్లో పాల్గొనలేదు.