దవీందర్ ధమాకా
♦ జావెలిన్ త్రోలో ఫైనల్లోకి
♦ నీరజ్ చోప్రాకు నిరాశ
♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
లండన్: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ దవీందర్ సింగ్ కాంగ్ అద్భుతం చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో దవీందర్ సింగ్ ఈటెను 84.22 మీటర్ల దూరం విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 83 మీటర్ల దూరం విసిరిన వారందరికీ ఫైనల్‌కు చేరుకునే అర్హత ఉండగా... మొత్తం 32 మందిలో 13 మంది ఈ మార్క్‌ను అధిగమించారు.
ఫైనల్ నేడు (శనివారం) జరుగుతుంది. భారత్‌కే చెందిన అండర్–20 వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా మాత్రం నిరాశపరిచాడు. ఈటెను 82.26 మీ. దూరం విసిరి 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత జూన్‌లో దవీందర్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను గంజాయి సేవించినట్లు తేలింది. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో గంజాయి లేకపోవడంతో దవీందర్‌పై సస్పెన్షన్ వేటు పడలేదు. దాంతో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు.