ఐదు రోజుల పరీక్ష! | New Zealand have an edge over India in Test series | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పరీక్ష!

Published Wed, Feb 5 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

ఐదు రోజుల పరీక్ష!

ఐదు రోజుల పరీక్ష!

గురువారం తెల్లవారుజామున
 గం. 3.30 నుంచి సోనీ సిక్స్‌లో
 ప్రత్యక్ష ప్రసారం
 
 న్యూజిలాండ్ గడ్డపై ఎన్నో అంచనాలతో అడుగు పెట్టిన భారత జట్టు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కాస్త ప్రభావం చూపినట్లు కనిపించినా...భిన్నమైన పిచ్‌లు, బౌలర్లు ఎదురయ్యే అసలు టెస్ట్ మ్యాచ్‌తో దీనిని పోల్చలేం. మరో వైపు భారత్ బలహీనతపై గురి పెడుతూ పేస్‌తో విరుచుకు పడతామంటూ కివీస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ పరాభవంనుంచి కోలుకొని టీమిండియా రెండు టెస్టుల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.
 
 ఆక్లాండ్: ‘భారత జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేసినా మా షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో వారు తడబడ్డారు. పుల్ లేదా హుక్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యారు. టెస్టుల్లో ఇలాంటివి ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 
 మరి ఈ విషయంలో వారు పాఠాలు నేర్చుకున్నారేమో తెలీదు’...వాంగేరిలో తమతో వార్మప్ మ్యాచ్ అనంతరం కివీస్ ఎలెవన్ కెప్టెన్ ఆంటాన్ డేవ్‌సిక్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య టీమిండియా ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోంది. మరి నిజంగా భారత జట్టు పరిస్థితి అలాగే ఉందా, లేక గత పర్యటనతో పోలిస్తే మన పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా రానున్న ఐదు రోజుల్లో తేలిపోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారంనుంచి ఇక్కడి ఈడెన్ పార్క్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
 
 ఫామ్‌లో కివీస్...
 సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఒక పెద్ద జట్టు (వెస్టిండీస్)పై టెస్టు సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఆ జట్టులో ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. దాంతో ఒక్క మార్పు లేకుండా అదే జట్టును ఈ సిరీస్ కోసం కొనసాగించారు. టేలర్, విలియమ్సన్‌ల ఫామ్ సానుకూలాంశం. బౌలింగ్‌లో కివీస్ కూడా ముగ్గురు పేసర్లతో పాటు సోధి రూపంలో ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగవచ్చు. ఎడమ చేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ భారత్‌కు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది
 
 మార్పుల్లేకపోవచ్చు...
 వార్మప్ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ముగ్గురు మరి కొంత సేపు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపించింది. వైఫల్యంగా చెప్పకపోయినా విజయ్, ధావన్, పుజారా త్వరగానే పెవిలియన్ చేరారు. రోహిత్, రహానేలకు మాత్రం ప్రాక్టీస్ లభించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పేస్ బౌలింగ్‌ను మన జట్టు సమర్థంగా ఎదుర్కోవడంపై జట్టు విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి.
 
 దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టు ఆడిన టీమ్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. భారత్ ముగ్గురు పేసర్లతో ఆడితే...స్పిన్నర్ అశ్విన్, జడేజాల మధ్య స్థానం కోసం పోటీ ఉంటుంది. ప్రస్తుతానికి ఫామ్ పరంగా మొగ్గు  జడేజా వైపే ఉంది. జహీర్, షమీ ప్రధాన పేసర్లు కాగా, ఇషాంత్, ఉమేశ్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నా పాండేకు అప్పుడే అవకాశం దక్కకపోవచ్చు.
 
 పిచ్, వాతావరణం
 టైగా ముగిసిన మూడో వన్డే జరిగిన ఈడెన్ పార్క్‌లోనే ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం కూడా రెడీమేడ్ ‘డ్రాప్ ఇన్’ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై చక్కటి బౌన్స్ ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ చివర్లో టర్న్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఎప్పుడూ ఆకాశం మేఘావృతంగానే కనిపిస్తుంది.  కానీ భారీ వర్షానికి అవకాశం లేదు. ఐదు రోజులూ మ్యాచ్‌కు అడ్డంకి ఉండకపోవచ్చు.
 
 జూన్ 2011 వరుసగా 12 టెస్టుల పాటు భారత జట్టు విదేశాల్లో విజయం సాధించలేదు.
 ఆక్లాండ్‌లో నాలుగు టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి, 2 డ్రా చేసుకుంది. కివీస్ గడ్డపై భారత్‌కు దక్కిన 5 విజయాల్లో 2 ఇక్కడే రావడం విశేషం.
 
 
 జట్ల వివరాలు (అంచనా):
 భారత్: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్ శర్మ, జడేజా, జహీర్, షమీ, ఇషాంత్/ఉమేశ్.
 
 న్యూజిలాండ్: బ్రెండన్ మెకల్లమ్, ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్, విలియమ్సన్, టేలర్, అండర్సన్, వాట్లింగ్, సౌతీ, సోధి, వాగ్నర్, బౌల్ట్.
 
 భారత్‌పై ఒత్తిడి పెంచుతాం
 ‘భారత బ్యాట్స్‌మన్ అటాకింగ్ తరహా ఆట ఆడతారు. చక్కటి స్వింగ్, బౌన్స్‌తో వారి బ్యాటింగ్ టెక్నిక్ బలహీనతలు బయటపెడతాం.
 
 మా వ్యూహాలతో వారిని కట్టడి చేస్తాం. అయితే అలాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌తో పోటీ పడటం మాకు కూడా సవాలే. క్రమం తప్పకుండా బౌన్సర్లు వేసేందుకు ప్రయత్నిస్తాం. విండీస్‌తో సిరీస్‌లో స్వింగ్ నా బలం. ఇప్పుడు దానినే కొనసాగిస్తా’
 - ట్రెంట్ బౌల్ట్, న్యూజిలాండ్ బౌలర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement