వీవీఎస్ రికార్డును బద్ధలు కొడతాడా?
ముంబై: ప్రియాంక్ పాంచల్.. ఈ రంజీ సీజన్లో మార్మోగుతున్న పేరు. పంజాబ్పై అజేయ ట్రిపుల్ కొట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గుజరాత్ తరపున ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు జార్ఖండ్తో జరిగిన సెమీ ఫైనల్లో పాంచల్(149) టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే క్రమంలో గుజరాత్ చిరస్మణీయ విజయంలో పాలు పంచుకున్నాడు. ఈ రంజీ సీజన్ ఆరంభం నుంచి తనదైన మార్కును చాటుకుంటూ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో 1270 పరుగుల సాధించి అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఇప్పుడు పాంచల్ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. మరో 146 పరుగులను పాంచల్ సాధిస్తే, మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ గతంలో నెలకొల్పిన రికార్డు బద్ధలవుతుంది. రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ వీవీఎస్ పేరిటే ఉంది. 1999 సీజన్లో లక్ష్మణ్ 1415 పరుగుల్ని సాధించాడు. ఇదే నేటి వరకూ రంజీ సీజన్లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ అవకాశం పాంచల్ ముంగిట ఉంది. మంగళవారం నుంచి ముంబైతో జరిగే రంజీ ఫైనల్లో పాంచల్ రాణించిన పక్షంలో లక్ష్మణ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.