
ఎదురులేని టైటాన్స్
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పట్నాపై విజయం
ముంబై: వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా తెలుగు టైటాన్స్ తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట పట్నా పైరేట్స్‌పై 46-25 తేడాతో రాహుల్ బృందం ఘనవిజయాన్ని అందుకుంది. మూడు వరుస పరాజయాలతో లీగ్‌ను ఆరంభించిన టైటాన్స్ పాయింట్ల పట్టికలో 50 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో పట్నా, మూడో స్థానంలో జైపూర్ ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో జరిగే సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది.
ఇక పట్నాతో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్ చౌధరి చెలరేగి 11 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకోగా సందీప్ నర్వాల్ ఆరు ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పట్నా నుంచి అబోల్‌ఫజల్ 9 పాయింట్లు సాధించాడు.
పుణెరి సెమీస్ ఆశలు సజీవం
మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 39-34 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీపై నెగ్గి తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీపక్ నివాస్ హుడా అత్యధికంగా 17 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టి జట్టును గెలిపించాడు. నేడు (బుధవారం) ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యు ముంబా ఓడిపోవడంతో పాటు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై నెగ్గితే పుణెరి జట్టు సెమీస్ చేరుతుంది.