'ఐపీఎల్.. ప్రతి సీజన్లోనూ సమస్యలు'
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి ఏడాది ఫ్రాంచైజీలకు ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాలీవుడ్ నటి , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింటా వ్యాఖ్యానించారు. ప్రతి సీజన్లో ఆటగాళ్లపై, ఫ్రాంచైజీలపై వదంతులు వ్యాపిస్తున్నాయని అవి తమ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి మ్యాచ్ వేదికల తరలింపు అంశంపై ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఐపీఎల్ లో ప్రతి సీజన్ సమస్యలమయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎల్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కానీ లీగ్ నిర్వహణ సమస్యలతో తమ ఫ్రాంచైజీకి కలిసిరావడం లేదన్నారు.
2013 లో చూసినట్టయితే స్పాట్ ఫిక్సింగ్ కలకలం సృష్టించింది. అందులో ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ప్రీతీ జింటా ప్రస్తావించారు. 2014 సీజన్ విషయానికొస్తే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల దృష్టా ఐపీఎల్-7 తొలి అర్థభాగంలో మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 2015 సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్లపాటు నిషేధించారు.గత సీజన్లో తమ బౌలింగ్ బలహీనంగా ఉందని, ప్రస్తుతం ఆ లోపాలను సరిచేసుకున్నామని ప్రీతీ జింటా పేర్కొన్నారు.