నాదల్‌దే బార్సిలోనా టైటిల్
బార్సిలోనా: సొంతగడ్డపై జరిగిన బార్సిలోనా ఓపెన్ టోర్నీని రఫెల్ నాదల్ (స్పెయిన్) కైవసం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడోసీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ నాదల్ 6–4, 6–1తో నాలుగోసీడ్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై అలవోక విజయం సాధించాడు. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు.
ఓవరాల్‌గా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి విజేతగా నిలిచాడు. గతవారమే మాంటెకార్లో ఓపెన్‌ను రికార్డు స్థాయిలో పదోసారి నెగ్గిన నాదల్.. బార్సిలోనా ఓపెన్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. సెమీస్‌లో ప్రపంచ నం.1 ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించి జోరు కనబర్చిన థీమ్.. ఫైనల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చాడు. 14 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ నాదల్.. ఈనెలలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు ఫామ్‌లోకి రావడం తన అభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది.