
ఇండోర్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన విదర్భ జట్టు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీకి తోడు ఆదిత్య సర్వతే, సిద్ధేశ్ నేరల్‌లు అర్ధశతకాలు సాధించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి విదర్భ 156 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. అంతకుముందు 206/4తో ఆట కొనసాగించిన విదర్భ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (78), వాఖరే (17) త్వరగానే పెవిలియన్ చేరినా... వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (243 బంతుల్లో 133 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు.
ఆదిత్య సర్వతే (79; 11 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 169 పరుగులు జోడించిన అతను.. సర్వతే అవుటైన అనంతరం సిద్ధేశ్ నెరల్ (92 బంతుల్లో 56 బ్యాటింగ్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అభేద్యమైన 113 పరుగుల జతచేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మూడో రోజు మొత్తం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 322 పరుగులు చేయడం విదర్భ ఆధిపత్యాన్ని చూపి స్తోంది. ఢిల్లీ బౌలర్లలో సైనీకి 3, ఆకాశ్‌కు 2 వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 233 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కోలుకొని మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా నడిపించగలిగినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ మొదటి సారి రంజీ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.