బీసీసీఐకి రవిశాస్త్రి షరతు!
ముంబై: ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఒక షరతును కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ముందు ఉంచాడట. ఒకవేళ తనను కోచ్ ఎంపిక చేస్తే మాత్రం మిగతా సహాయక సిబ్బందిని తానే ఎంపిక చేసుకుంటానంటూ బోర్డుకు స్సష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆరుగురు సిబ్బంది అవసరం కూడా బీసీసీఐకి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అందులో భరత్ అరుణ్(బౌలింగ్ కోచ్), సంజయ్ బంగర్(బ్యాటింగ్ కోచ్), ఆర్ శ్రీధర్(ఫీల్డింగ్ కోచ్), పాట్రిక్ ఫర్హాట్(ఫిజియో),శంకర్ బాసు(ట్రైనర్), రఘు(టీమ్ అసిస్టెంట్)లన తన సహాయక సిబ్బందిగా శాస్త్రి కోరినట్లు విశ్వసనీయ సమాచారం.
గత రెండు రోజుల క్రితం భారత క్రికెట్ కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీమిండియాకు రవిశాస్త్రి 18 నెలల పాటు డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తరువాత డైరెక్టర్ స్థానంలో తిరిగి కోచ్నే నియమించాలని బీసీసీఐ భావిస్తుండటంతో పలువురు క్రికెట్ పెద్దలు దీనికి పోటీ పడుతున్నారు. అటు రవిశాస్త్రితో పాటు, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్, మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్లు ప్రధాన కోచ్కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.