భారత్‌తో క్రికెట్ ఆడేందుకు మేం రెడీ: పాకిస్తాన్
భారత ప్రభుత్వం సరేనంటే.. టీమిండియాతో క్రికెట్ ఆడేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షాహ్రయార్ ఖాన్ చెప్పారు. ఈ ఏడాది చివర్లో దుబాయ్‌లో జరిగే పూర్తిస్థాయి పర్యటనకు భారత ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బీసీసీఐ మాత్రం ఇంతవరకు ఈ విషయమై తమను సంప్రదించలేదని ఖాన్ తెలిపారు. భారత ప్రభుత్వం సరేనంటే తాము పాక్ ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లతో కూడిన పూర్తిస్థాయి సిరీస్ ఒకదాన్ని దుబాయ్‌లో ఈ ఏడాది చివర్లో నిర్వహిస్తే బాగుంటుందని బీసీసీఐ ప్రతిపాదించింది.
దీనిపై హోం మంత్రిత్వశాఖకు బీసీసీఐ లేఖ రాసిందని, పాక్‌తో ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరిందని అంటున్నారు. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ చాలావరకు అంతర్జాతీయ మ్యాచ్‌లను తమ స్వదేశంలో కాకుండా వేరే దేశాల్లో నిర్వహిస్తూ ఉంటుంది. ఎక్కువగా దుబాయ్ వెళ్తుంది. 2009 మార్చి 3వ తేదీన పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు ఆటగాళ్లున్న బస్సు మీద ఉగ్రవాదులు దాడి చేయడంతో, ఆ తర్వాతి నుంచి ఏ దేశం జట్టు కూడా పాక్ గడ్డ మీద అడుగుపెట్టలేదు. అప్పట్లో జరిగిన దాడిలో ఆరుగురు క్రీడాకారులతో పాటు బ్రిటిష్ కోచ్ కూడా గాయపడ్డారు.