
మళ్లీ ‘పిచ్’ఎక్కించాడు!
కోల్‌కతా: ఈడెన్ ‘సీతయ్య’ ప్రబీర్ ముఖర్జీ మరోసారి క్రికెటర్లంటే లెక్క లేని వైఖరిని ప్రదర్శించారు. ఒక వైపు సచిన్ 199వ టెస్టు అంటూ భారీ ప్రచారం, హడావిడి కనిపిస్తున్నా క్యురేటర్ మాత్రం తన దారి తనదే అన్నట్లు వ్యవహరించారు. తరచూ వివాదాలతో సావాసం చేసే ముఖర్జీ సోమవారం భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను పిచ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే...మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలించడం సహజం. భారత జట్టు ప్రాక్టీస్‌కు ముందు రోహిత్ శర్మ కూడా అదే పని చేయబోయాడు. బెంగళూరులో అద్భుత ప్రదర్శన అనంతరం ఈడెన్‌లో ఘన స్వాగతం దక్కించుకున్న రోహిత్‌కు క్యురేటర్ నుంచి మాత్రం అనూహ్యంగా తిరస్కారం ఎదురైంది. రోహిత్ పిచ్ వద్దకు వచ్చాక, ప్రబీర్ దానిని దగ్గరగా చూడనివ్వలేదు. అక్కడే ఉన్న ‘కేవలం కెప్టెన్, కోచ్‌లకు మాత్రమే అనుమతి’ అనే బోర్డును చూపిస్తూ ముఖర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రోహిత్ మొహం చిన్నబోయింది.
క్యురేటర్‌తో ఎలాంటి వాదనకు దిగకపోయినా శర్మ అసంతృప్తిగా వెనుదిరిగాడు. అయితే విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ విషయంలో మాత్రం క్యురేటర్ భిన్నంగా స్పందించారు. గేల్ కెప్టెన్ కాదు... కోచ్ కాదు... జట్టులోని సాధారణ ఆటగాడు మాత్రమే. కానీ గేల్ మాత్రం పిచ్ వద్ద కూర్చొని స్వేచ్ఛగా దానిని పరిశీలించడం గమనార్హం.