సచిన్ నిరీక్షణకు తెరపడిన వేళ!
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్.. ఈ పేరుకు బలమెక్కువ. మాస్టర్ బ్యాట్ నుంచి జాలువారిన పరుగులే ఇందుకు నిదర్శనం. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు.. వీటితోనే సచిన్ సావాసం. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్కు వన్డేల్లో శతకం చేయడానికి ఆరేళ్లు పట్టింది. 1989లో అంతర్జాతీయ కెరీర్ను ఆరంభించిన సచిన్.. 1990లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సెంచరీ సాధించాడు.
మరి సచిన్ తొలి వన్డే సెంచరీ అంత త్వరగా అతని ఖాతాలో చేరలేదు. దాదాపు 78 మ్యాచ్లు ఆడిన తరువాత సచిన్ వన్డే సెంచరీ సాధించాడు. తాను నమోదు చేసిన అర్థశతకాలను సెంచరీగా మలచడానికి సచిన్ చాలానే శ్రమించాడు. 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సచిన్ తన తొలి సెంచరీ సాధించాడు. అది జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 9 వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సచిన్ తన సెంచరీల రికార్డులకు పునాది వేసుకున్నాడు. ఆ తరువాత వెనుదిరిగ చూడని సచిన్.. అదే ఏడాది వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. 1995లో సచిన్ ఖాతాలో ఒక్క వన్డే సెంచరీ మాత్రమే వచ్చినా.. 1996లో ఆరు శతకాలతో దుమ్మురేపాడు. ఓవరాల్గా సచిన్ వన్డే కెరీర్లో 49 సెంచరీలు చేస్తే, టెస్టుల్లో 51 శతకాలు సాధించాడు.