సచిన్ చిన్నపిల్లాడిలా...
నాలుగేళ్ల వయసులో బ్యాట్ పట్టిన సచిన్ టెండూల్కర్‌కు 40 ఏళ్ల వరకు అదే జీవితమైంది. క్రికెట్ తప్ప తనకి మరో లోకం కనిపించలేదు. స్కూల్ సరదాలు, ఇతర ఆటపాటలను సచిన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి మధురానుభూతులు కూడా పెద్దగా తనకి లేవు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఇటీవల ముంబై ఇండియన్స్ టీమ్ ప్రాక్టీస్ సందర్భంగా సచిన్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ మ్యాచ్ కోసం కుర్రాళ్లకు సూచనలు, సలహాలు ఇచ్చిన టెండూల్కర్... కొద్దిగా ఖాళీ సమయం దొరకగానే పక్కకు వచ్చేశాడు.
ఆ సమయంలో ఒక్కసారిగా అతనిలోని పిల్లాడు బయటకొచ్చాడు. ఆటగాళ్లంతా సాధన చేస్తుండగా, తాను మైదానంలో మరో వైపు వెళ్లిపోయాడు. రిమోట్‌తో ఆపరేట్ చేసే డ్రోన్‌ను తెప్పించి తన ఆట ప్రారంభించాడు. గాల్లో దానిని అటూ ఇటూ తిప్పుతూ చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ, చాలా సేపు దానితో సరదా తీర్చుకున్నాడు. అయితే తన సిక్సర్ల తరహాలో డ్రోన్‌ను మైదానం బయటికి పంపకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ డ్రోన్‌ను ఇతర క్రికెటర్ల ముందుకు తీసుకెళ్లి సరదాగా వాళ్లని ఆటపట్టించాడు కూడా.