సమీర్ వర్మ సంచలనం
ప్రపంచ ఐదో ర్యాంకర్‌పై గెలుపు ∙ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సమీర్ 21–17, 21–10తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు.
తొలి రౌండ్‌లో సైనా 21–10, 21–17తో చియా సిన్ లీ (చైనీస్ తైపీ)పై, సింధు 21–17, 21–6తో అరుంధతి పంతవానె (భారత్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–19, 21–16తో జావో జున్‌పెంగ్ (చైనా)పై, సాయిప్రణీత్ 16–21, 21–12, 21–19తో కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–13, 21–16తో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21–23, 17–21తో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.