ఆసియా గేమ్స్‌లో పాల్గొంటా: సానియా
బెంగళూరు: డబ్ల్యూటీఏ టోర్నీల్లో ఆడేందుకు ఆసియా గేమ్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సానియా మీర్జా ఇప్పుడు మనసు మార్చుకుంది. ‘ఆసియా గేమ్స్‌లో ఆడకూడదన్న నిర్ణయంతో నేను సంతోషంగా లేను. అందుకే గేమ్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నాను. ఈ కారణంగా వుహాన్ డబ్ల్యుటీఏ టోర్నీకి అందుబాటులో ఉండను కాబట్టి 900 పాయింట్లు కోల్పోతాననే విషయం తెలుసు. కానీ ఒక్కోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇందులో ఎవరి ఒత్తిడీ లేదు. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తామని అనుకుంటున్నాను’ అని సానియా తెలిపింది. మరో వైపు స్టార్ ఆటగాళ్లంతా ఆసియా గేమ్స్‌కు దూరమవుతున్నామని ప్రకటించడంతో క్రీడా శాఖ అసలు టెన్నిస్ జట్టును పంపడమే దండగ అనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
జాఫ్రీన్‌కు చేయూత
సాక్షి, హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ నెగ్గిన ఆనందంలో ఉన్న భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరో వర్ధమాన ప్లేయర్‌కు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకుంది. సానియా అకాడమీలోనే శిక్షణ పొందుతున్న బధిర టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్‌కు సానియా రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. సానియా తరఫున ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా శుక్రవారం ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌కు జాఫ్రీన్‌కు అందజేశారు. 2012లో జాతీయ బధిరుల టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన జాఫ్రీన్, 2013లో జరిగిన బధిరుల ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది కాలంగా ఆమె మొయినాబాద్‌లోని సానియా అకాడమీలో ఉచిత శిక్షణ పొందుతోంది.
ప్రధానిని కలిసిన సానియా
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ నెగ్గిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసిన సానియాతో ఆమె తల్లి నసీమా కూడా ఉంది. ఈ సందర్భంగా సానియా గ్రాండ్‌స్లామ్ విజయాన్ని మోడీ ప్రశంసించారు. అంతకుముందు సానియా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసింది.