సమం చేయాల్సిందే
►నేడు రెండో టి20 మ్యాచ్
►ఒత్తిడిలో భారత్
►ఓడితే సిరీస్ గల్లంతు
►ఉత్సాహంగా శ్రీలంక
తొలి టి20 మ్యాచ్‌లో అనూహ్య ఓటమి భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఈ పరాజయంతో వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా సొంతగడ్డపై జరగబోయే వరల్డ్ కప్‌కు ముందు ద్వితీయ శ్రేణి లంక జట్టుతో సిరీస్ ఓడితేఅదిఅవమానకరమే.కాబట్టిదానితప్పించుకోవాలంటే ముందు పోటీలో నిలవాలి. అందుకు రెండో మ్యాచ్‌లోనే తమదైన శైలిలో చెలరేగాలి. మన స్టార్లు స్థాయికి తగినట్లుగా ఆడితే విజయం కష్టం కాబోదు... కానీ మరోసారి ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే మాత్రం గత ఫలితం పునరావృతం అవుతుంది.
రాంచీ: ఐపీఎల్‌లో మున్ముందు సొంత మైదానం కానున్న పుణే ధోనికి పరాజయభారం మిగిల్చింది. ఇక తన సొంత ఊరిలో దానికి అతను మందు రాయాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు (శుక్రవారం) జరిగే రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్ ఓడి సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడిన టీమిండియా ఇది గెలిస్తేనే సిరీస్‌లో అవకాశం మిగిలి ఉంటుంది. మళ్లీ ఓడితే మాత్రం భారత గడ్డపై జట్టుకు వరుసగా రెండో సిరీస్ పరాజయం ఖాతాలో పడుతుంది. మరో వైపు తొలి గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో శ్రీలంక కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే జోరులో మళ్లీ ఇండియాను కంగు తినిపించాలని వారు పట్టుదలగా ఉన్నారు.
మార్పులు ఉంటాయా..? ‘అందరికీ బ్యాటింగ్ అవకాశం రావడం మంచిదే’ అంటూ తొలి మ్యాచ్ తర్వాత కెప్టెన్ ధోని వ్యాఖ్యానించాడు. అయితే అందరూ ఆడటంతో మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలంపై కూడా ఒక అంచనా వచ్చింది. ఆల్‌రౌండర్లు పాండ్యా, జడేజా ఇంకా కుదురుకోవాల్సి ఉందని అర్థమైంది. వరల్డ్‌కప్‌లోగా ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయని కెప్టెన్ నమ్మకంగా చెబుతున్నాడు. మరి ఇదే జట్టును ఈ మ్యాచ్ కోసం కొనసాగిస్తారా లేక మార్పులు చేసి మరొకరిని పరీక్షిస్తారా చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో దీనికి పెద్దగా అవకాశం లేదు గానీ జడేజా స్థానంలో నేగిని ఆడించే అవకాశం ఉంది. అశ్విన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం కూడా జట్టుకు బలంగా మారడంతో హర్భజన్ ఈసారి కూడా డగౌట్‌కే పరిమితం. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సమర్పించుకున్న గత మ్యాచ్ అనుభవంతో మన ప్రధాన బ్యాట్స్‌మెన్ ఈ సారి కాస్త జాగ్రత్తపడతారు. టాప్-4 రోహిత్, ధావన్, రహానే, రైనా చెలరేగితే జట్టుకు తిరుగుండదు. వీరే మ్యాచ్ దిశను నిర్ణయించగలరు. మరో వైపు వ్యక్తిగతంగా బ్యాటింగ్ ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న ధోని కూడా తన బ్యాట్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పుణే వైఫల్యం అరుదుగా జరిగేవాటిలో ఒకటి. కాబట్టి దానిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడితే భారత్‌ను ఆపడం లంక బౌలర్లకు కష్టంగా మారుతుంది.
దిల్షాన్‌కు చోటు
గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన సీనియర్ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ రెండో టి20కి అందుబాటులోకి వచ్చాడు. అతని స్థానంలో ఆడిన కీపర్ డిక్‌వెలా లేదా స్పిన్నర్ ప్రసన్నలలో ఒకరిని తుది జట్టునుంచి తప్పిస్తారు. ఇది మినహా స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన యువ జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. పేస్ పిచ్‌పై తొలి మ్యాచ్‌లో రజిత, చమీరా, షనక చెలరేగిపోయారు. సాధారణంగా బ్యాటింగ్ వికెట్ అయిన రాంచీలో అంతగా అనుకూలించకపోయినా గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ ముగ్గురు మరోసారి మెరుగైన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాట్స్‌మెన్ కూడా ఒత్తిడి గురయ్యారు. అయితే దిల్షాన్ రాకతో వారి బ్యాటింగ్ కాస్త పటిష్టంగా మారింది. చండీమల్, కపుగెదెర దూకుడుగా ఆడగల సమర్థులు. సిరివర్దన, తిసార పెరీరా కూడా మంచి హిట్టర్లు. భారత జట్టుతో పోలిస్తే అనుభవం తక్కువగా ఉన్నా... ఒకటి, రెండు ఓవర్లలో మ్యాచ్ ఫలితం మారిపోయే ఫార్మాట్‌లో లంక ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
తుది జట్ల వివరాలు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, జడేజా/నేగి, అశ్విన్, నెహ్రా, బుమ్రా.
శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), డిక్‌వెలా/దిల్షాన్, గుణతిలక, కపుగెదెర, సిరివర్దన, షనక, ప్రసన్న, తిసార, సేననాయకే, రజిత, చమీరా.
పిచ్, వాతావరణం
రాంచీలో గతంలో టి20 మ్యాచ్ జరగలేదు. కానీ వన్డేల్లో భారీ స్కోర్లు వచ్చాయి. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అయితే హడావిడిగా వేదిక మార్చడంతో మైదానం పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి పిచ్ అనూహ్యంగా స్పందించవచ్చు కూడా. వాతావరణం బాగుంది. వర్షసూచన లేదు.
పరిస్థితులను తొందరగా అంచనా వేయడమే కీలకం. గత మ్యాచ్ పొరపాటును ఇక్కడ పునరావృతం కానీయం. మైదానంలోకి దిగిన తర్వాతే ఎంత స్కోరు సరిపోతుందనేది చెప్పగలం. వరల్డ్‌కప్‌కు ముందు అందరు ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. ఎలాంటి పిచ్‌పైనైనా ఆటగల సామర్థ్యం భారత జట్టుకు ఉంది’ -రవిశాస్త్రి, టీమ్ డెరైక్టర్