వరల్డ్ నెం.2ను మట్టికరిపించిన పి.వి. సింధు
స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ పోటీలలో తెలుగుతేజం పి.వి. సింధు మెరిసింది. వరల్డ్ నెం.2 షిజియాన్ వాంగ్ను వరుస సెట్లలో ఓడించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్లోని సెయింట్ జాకబ్షల్లెలో జరుగుతున్న ఈ పోటీలలో మరో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ కూడా సెమీస్ లోకి వెళ్లాడు. వరల్డ్ నెం.9 ర్యాంకులో ఉన్న సింధు కేవలం 45 నిమిషాల్లో 21-17, 21-15 తేడాతో షిజియాంగ్కు దిమ్మ తిరిగేలా చేసింది. వాంగ్ను ఇంతకుముందు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా సింధు ఓడించింది. సెమీస్లో చైనాకే చెందిన సున్ యుతో సింధు ఆడనుంది.
అయితే, చైనా గోడను బద్దలుకొట్టడం ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ వల్ల కాలేదు. వరల్డ్ నెం.3 ఇహాన్ వాంగ్ చేతుల్లో 17-21, 12-21 తేడాతో సైనా ఓడిపోయింది. ఇక పారుపల్లి కశ్యప్ అయితే చైనాకు చెందిన టియెన్ చెన్ చౌను ఓడించాడు. ఈ మ్యాచ్ మాత్రం అత్యంత భీకరంగా ఏకంగా గంటా 14 నిమిషాల పాటు సాగింది.