
ఇంట్లో హిట్... బయట ఫ్లాప్
విదేశాల్లో ధోని చెత్త రికార్డు
రక్షణాత్మక ధోరణిలో వ్యూహాలు
పదే పదే అవే తప్పులు
‘ధోని టెస్టు కెప్టెన్సీ ఘోరాతిఘోరంగా ఉంది. వరల్డ్ కప్ ఏడాది లోపు లేకపోతే అతడిని వెంటనే తొలగించాలని నేనూ కోరేవాణ్ని’ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్య.
‘భారత కెప్టెన్‌కు తన పేస్ బౌలర్లపై నమ్మకం లేదు. అందుకే కొత్త బంతిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తాడు. పాత బంతితో పరుగులు ఆపాలనేది అతని వ్యూహమైతే అది సరైంది కాదు’ మరో మాజీ కెప్టెన్ ద్రవిడ్ చురక.
‘రక్షణాత్మక ధోరణితో వ్యవహరించిన ప్రతీసారి ధోని ప్రత్యర్థి కోలుకునేలా చేస్తాడు. చాలా మంది ఇతర భారత కెప్టెన్లలాగే సొంతగడ్డపైనే అతనిది గొప్ప రికార్డే తప్ప ప్రత్యేకత ఏమీ లేదు. అతడిని తప్పించే సమయం వచ్చింది’ మాజీ ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ మాట.
తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోల్పోవడంతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంపై మరోసారి విమర్శలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గత నాలుగు టెస్టుల్లో రెండుసార్లు విజయానికి చేరువగా వచ్చినా... ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలం కావడం ధోని నాయకత్వ లక్షణాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని అనడంలో సందేహం లేదు. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్... ఇలా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన నాయకుడు అతను. అయితే విదేశీ గడ్డపై చాలా మంది భారత కెప్టెన్లలాగే ధోని రికార్డు కూడా చెత్తగా ఉంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో ధోని ఎదురుదాడికి దిగకుండా, ఆత్మ రక్షణ ధోరణిలోనే ఆడటం ఇందుకు కారణమని విశ్లేషణ. -సాక్షి క్రీడా విభాగం
ఇదేం ఫీల్డింగ్...
విదేశాల్లో జరిగిన గత 14 టెస్టుల్లో భారత జట్టు ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. అయితే అసలు గెలిచే అవకాశమే రాలేదా అంటే అదీ కాదు. ఎన్నో సార్లు మన జట్టు ఆధిక్యంలో ఉన్నా తప్పుడు వ్యూహాలతో దానిని చేజార్చుకుంది. వెల్లింగ్టన్ టెస్టులో మూడో రోజు అప్పటికే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ మరో 130 పరుగులు వెనుకబడి ఉంది. బంతి కూడా 45 ఓవర్లు పాతదే. అప్పుడు ఒక్క స్లిప్ కూడా లేకుండా ఆరుగురు ఫీల్డర్లను లెగ్‌సైడ్‌లో ఉంచి ఇషాంత్‌తో ధోని బౌలింగ్ చేయించాడు. జడేజా బౌలింగ్‌లో మెకల్లమ్ భారీ షాట్లు కొడతాడని ఆశించి లాంగాన్, లాంగాఫ్‌లలో ఒక్కో ఫీల్డర్‌ను కొనసాగించాడు. ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న కివీస్‌ను అటాక్ చేయాల్సింది పోయి ఫీల్డర్లంతా బౌండరీ దగ్గరే ఉండటంతో మెకల్లమ్ చక్కటి సింగిల్స్ తీసుకున్నాడు. కివీస్ స్కోరు 100లోపే ఉన్నా స్లిప్‌లో ఫీల్డర్ లేక చక్కటి క్యాచ్ అవకాశాలు కూడా పోయాయి. మ్యాచ్ నాలుగో రోజు కివీస్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 5 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఉండగా... ఉదయం పూట తేమతో వికెట్‌కు పేస్‌కు అనుకూలంగా ఉంది. దాదాపుగా కొత్త బంతి (19 ఓవర్లు) అందుబాటులో ఉన్న సమయంలో కూడా ఫీల్డింగ్ రక్షణాత్మకంగా ఉంచడం పరాకాష్ట! ఆ తర్వాత ఆఫ్‌సైడ్‌లో ఏడుగురు ఫీల్డర్లను ఉంచి ఇషాంత్, షమీలతో రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయించడం కూడా వ్యూహలోపంగానే చెప్పవచ్చు. అవసరం లేకపోయినా పార్ట్‌టైమర్ రోహిత్ శర్మ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డర్ కనిపించాడు.
గతంలోనూ ఇలాగే...
కివీస్‌తో సిరీస్‌లోనే కాదు. గతంలో కూడా ధోని ఇలాంటి ఆత్మ రక్షణ ధోరణితో అనేక వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు. ఎవరైనా ఫీల్డర్ ఒక్కసారి బంతిని ఆపేందుకు బౌండరీ వద్దకు వెళితే ఇక మళ్లీ వెనక్కి రావడం లేదు. అక్కడే ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ నిలబడిపోతున్నారు. విదేశీ గడ్డపై వ్యూహాలను చూస్తే... విండీస్‌పై గెలిచే అవకాశం ఉన్నా ‘డ్రా’తోనే సరిపెట్టుకోవడం, లార్డ్స్‌లో ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయిన దశలో కొత్త బంతి అందుబాటులో ఉంటే రైనాతో బౌలింగ్ చేయించడం, మెల్‌బోర్న్‌లో ఆసీస్ 6 వికెట్లు కోల్పోయిన దశలో కొత్త బ్యాట్స్‌మన్ కోసం లాంగాన్, డీప్ మిడ్ వికెట్, డీప్ ఫైన్‌లెగ్‌లలో ఫీల్డర్లను ఉంచడం చెత్త కెప్టెన్సీకి నిదర్శనం. ఇటీవల డర్బన్ టెస్టులోనైతే 146 ఓవర్ల తర్వాత గానీ... అదీ అంపైర్లు ఆదేశించడంతో కొత్త బంతిని తీసుకోవడం విమర్శలపాలైంది. సరిగ్గా చెప్పాలంటే వికెట్లు తీయడంకంటే పరుగులు నిరోధించడంపైనే దృష్టి పెట్టిన ధోని వ్యూహం విదేశీ గడ్డపై ఎక్కడా పని చేయడం లేదు.
ఇకపై ఏమిటి...
గతంతో పోలిస్తే మా ప్రదర్శన చాలా మెరుగుపడిందంటూ ఆటతీరును సమర్థించుకున్న ధోని, తన ఆత్మ రక్షణ ధోరణి గురించి మాట్లాడేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు. ఫలితంకంటే నేర్చుకునే ప్రక్రియ గురించే మాట్లాడేందుకు తాను ఇష్టపడతానని చెప్పిన ధోని, మరి ఇటీవలి వ్యూహాత్మక తప్పిదాల నుంచి ఏం నేర్చుకున్నాడో తెలీదు. గతంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో ఆరంభంలోనే పలు అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకున్న భారత్, ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా మళ్లీ అవే దేశాల్లో భారత్ పర్యటించనుంది. ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించేందుకు ఎక్కడో ఒకసారి చాన్స్ లభిస్తుంది. దాన్ని వాడుకుంటేనే పట్టు చిక్కే అవకాశం ఉంటుంది. అలాంటి కీలక క్షణాల్లో ధోని మరింత సాధికారికంగా వ్యవహరిస్తేనే పరాజయాల పరంపరకు బ్రేక్ పడుతుంది.