
చెలరేగిన రోహిత్: ఆసీస్ కు భారీ లక్ష్యం
ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆసీస్ బౌలింగ్ కు పరీక్షగా నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించారు. రోహిత్ శర్మ(171 నాటౌట్; 163 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగిపోయి ఆసీస్ బౌలర్లను ఊచకోత కోయగా, విరాట్ కోహ్లి(91;97బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకుని తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
టాస్ గెలిచిన టీమిండియా ఆదిలోనే శిఖర్ ధవన్(9)ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. అయితే ఆ ఆనందం ఆసీస్ శిబిరంలో ఎంతో సేపు నిలవలేదు. రోహిత్-కోహ్లిల ద్వయం ఆసీస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సుదీర్ఘంగా క్రీజ్ లో నిలిచారు. దాదాపు మూడు గంటల పాటు క్రీజ్ లో నిలుచుని రెండో వికెట్ కు 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా పటిష్టస్థితికి చేరింది. అయితే జట్టు స్కోరు 243 వద్ద ఫాల్కనర్ బౌలింగ్ లో షాట్ కు యత్నించిన విరాట్ అవుటయ్యాడు. అనంతరం రోహిత్ కు జత కలిసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్కోరును ముందుకు తీసుకువెళ్లే క్రమంలో పెవిలియన్ చేరాడు. ధోని 13 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. చివరి ఓవర్ లో రవీంద్ర జడేజా(10) సాయంతో 14 పరుగులు రావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ కు రెండు వికెట్లు లభించగా, హజిల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది.
ఒకే ఒక్కడ రోహిత్..
పెర్త్ లోని 'వాకా' స్టేడియం అంటేనే పేస్ కు స్వర్గధామం. మరి అటువంటి పిచ్ లో రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక్కడ భారత్ తరపున తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. దీంతో పాటు కెరీర్ లో తొమ్మిదో శతకాన్ని సాధించడమే కాకుండా, ఆస్ట్రేలియాలో మూడో వన్డే సెంచరీ చేశాడు. అంతకుముందు భారత్ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ ఒక్కేడే ఆస్ట్రేలియా పిచ్ లపై మూడో సెంచరీలను సాధించాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియాపై 19 వన్డే ఇన్నింగ్స్ లను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ (1027) వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 95. 53 ఉండగా, అతని సగటు 68.00కు పైగా ఉండటం విశేషం. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 209. 2013 లో బెంగళూరులో జరిగిన వన్డేలో రోహిత్ ఆ ఘనతను సాధించాడు.