వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆంటిగ్వా:వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, ఆపై రెండు వన్డేల్లో భారత్ జట్టు ఘన విజయాలు సాధించింది. భారత్ కు భారీ విజయాలు లభించడంలో ఓపెనర్ రహానే పాత్ర వెలకట్టలేనిది. రద్దయిన తొలి వన్డేలో 62 పరుగులు చేసిన రహానే.. రెండో వన్డేలో 102 పరుగులు చేశాడు. ఇక మూడో వన్డేలో సైతం 72 పరుగులు చేసి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
మూడో వన్డేలో భారత్ జట్టు గెలుపొందిన తర్వాత రహానే తన ఫామ్పై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధానంగా టాపార్డర్లో ఆడే అవకాశాన్ని కల్పించి తన నిలకడైన ఆటకు కారణమైన కెప్టెన్ విరాట్ కోహ్లి, జట్టు మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేశాడు.
మూడో వన్డేలో భారత్ జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లు విజృంభించడంతో కరీబియన్లు 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలిపోయారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), అజింక్యా రహానేల(71) అర్ధ సెంచరీలకు తోడు జాదవ్(40), యువరాజ్(39)లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.