లాహోర్‌కు తొలి విజయం
బెంగళూరు: ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్న లాహోర్ లయన్స్... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో డాల్ఫిన్స్ జట్టుపై విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (45 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), నజీమ్ (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆసిఫ్ రజా (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. డాల్ఫిన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లాహోర్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్మల్, నజీమ్‌లు ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించడంతో లాహోర్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. ఫ్రిలింక్ 3 వికెట్లు తీశాడు.
అనంతరం డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫ్రిలింక్ (27 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) వాయు వేగంతో బ్యాటింగ్ చేశాడు. వాన్ విక్ (29 బంతుల్లో 36; 6 ఫోర్లు), వాండియార్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 93 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో ఫ్రిలింక్స్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సుబ్రయెన్ (1 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన డాల్ఫిన్స్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఉమర్ అక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.