
టీమిండియా సిరీస్ గెలిచేనా?
టీమిండియా-శ్రీలంకల మధ్య జరిగిన రెండు టీ 20ల్లో చెరొకటి గెలిచి సమంగా నిలిచారు.
విశాఖపట్నం: టీమిండియా-శ్రీలంకల మధ్య జరిగిన రెండు టీ 20ల్లో చెరొకటి గెలిచి సమంగా నిలిచాయి. తొలి టీ 20లో ధోని సేన ఓటమి పాలైతే.. అందుకు రెండో మ్యాచ్లో ఘనమై గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంకను తొలుత కుమ్మేసి 196 పరుగులు నమోదు చేసిన టీమిండియా.. ఆ తరువాత ఆ జట్టును 127 పరుగులకే కట్టడి చేసి సిరీస్ ను సమం చేసింది. దీంతో మూడో టీ 20 కీలకంగా మారింది. ప్రస్తుతం లెక్క సరి చేసి మంచి ఊపు మీద ఉన్న ధోని అండ్ గ్యాంగ్ ఆఖరి మ్యాచ్ను కూడా చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి టీ 20లో టీమిండియా గెలిచి సిరీస్ ను దక్కించుకుంటేనే తిరిగి నంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంటుంది.
త్వరలో స్వదేశంలో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా గెలుపుతో టోర్నీని ముగించాలని భావిస్తోంది. మరోవైపు శ్రీలంక కూడా అంచనాలకు మించి రాణించి తొలి మ్యాచ్ ను అవలీలగా గెలిచింది. దీంతో ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఆదివారం విశాఖలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టీ 20 రాత్రి గం.7.30 ని.లకు ఆరంభం కానుంది. 2012, సెప్టెంబర్ లో చివరిసారి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య విశాఖలో టీ 20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఒక్క బంతికూడా పడకుండానే రద్దయ్యింది. అనంతరం అక్కడ భారత్ ఆడే తొలి టీ 20 మ్యాచ్ ఇదే. కాగా, 2014 అక్టోబర్ లో ఇక్కడ వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండగా, ఆ జట్టు ఆకస్మికంగా పర్యటను రద్దు చేసుకుంది. ఆ తరువాత ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ జరగలేదు.
జట్టు యథాతధం
గత రెండు టీ 20ల్లో ఆడిన భారత జట్టునే చివరి మ్యాచ్ లో కొనసాగించే అవకాశం ఉంది. భారత క్రికెట్లో ప్రస్తుతం ప్రయోగాలు అనే మాటను నిషేధించామని కెప్టెన్ ధోని మాటలను బట్టి చూస్తే రేపటి తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే శ్రీలంకతో సిరీస్ కు ఎంపికైన భువనేశ్వర్ కుమార్, పవన్ నేగీ, హర్భజన్ సింగ్, మనీష్ పాండేలు రిజర్వ్ బెంచ్ కే పరిమితం కాకతప్పదు.
పిచ్, వాతావరణం
విశాఖ స్టేడియంలో బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉండనుంది. వర్షం పడే సూచనలు లేవు. ఉష్ణోగ్రత గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.