
హోవార్డ్ గోడను దాటి..క్వార్టర్స్ కు బెల్జియం
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్
జులై 4:శుక్రవారం
ఫ్రాన్స్ x జర్మనీ
రాత్రి గం. 9.30 నుంచి
బ్రెజిల్ xకొలంబియా
అర్ధరాత్రి గం. 1.30 నుంచి
జులై 5: శనివారం
అర్జెంటీనా xబెల్జియం
రాత్రి గం. 9.30 నుంచి
నెదర్లాండ్స్ xకోస్టారికా
అర్ధరాత్రి గం. 1.30 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఎటాకింగ్‌తో గుక్క తిప్పుకోనివ్వని ప్రత్యర్థులు..
అడ్డుకోలేక చేతులెత్తేసిన తమ డిఫెండర్లు..
గోల్‌పోస్ట్ పైకి బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి..
అయినా అడ్డుగోడలా నిలిచాడు
అమెరికా గోల్‌కీపర్ టిమ్ హోవార్డ్.
ఒకటి, రెండుసార్లు కాదు.. ఏకంగా 16 సార్లు!
ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్‌ను నిలువరించిన కీపర్‌గా రికార్డునూ నెలకొల్పాడు.
కానీ...
హోవార్డ్ శ్రమకు ఫలితం దక్కలేదు.
అతడు కట్టిన అడ్డుగోడను బద్దలు కొడుతూ బెల్జియం విజయభేరి మోగించింది.
అదనపు సమయంలో డి బ్రూనే, లుకాకు అందించిన అద్భుత గోల్స్‌తో అమెరికాపై గెలుపొంది క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.పోరాడినా.. అమెరికాకు మరోసారి నిరాశే ఎదురైంది.
సాల్వడార్: హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచిన ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసే పోరులో బెల్జియం చెలరేగి ఆడింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడు ప్రదర్శిస్తూ అమెరికాపై 2-1 గోల్స్‌తో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు.
కానీ అదనపు సమయంలో అదిరిపోయే ఆటతీరు కనబరిచాయి. బెల్జియం ఆటగాళ్లు కెవిన్ డి బ్రూనే (93వ నిమిషం), రుమేలు లుకాకు (105వ నిమిషం)లు వరుస గోల్స్‌తో తమ జట్టుకు ఆధిక్యాన్నందించారు. అయితే 107వ నిమిషంలో జులియన్ గ్రీన్ సాధించిన ఏకైక గోల్‌కే పరిమితమైన అమెరికా.. టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అమెరికా ఓడినా.. బెల్జియం దాడుల్ని సంచలన రీతిలో తిప్పికొట్టిన గోల్‌కీపర్ హోవార్డ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
1986లో సెమీఫైనల్‌కు చేరిన తరువాత ప్రపంచకప్‌లో బెల్జియంకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా వరుసగా రెండో సారి ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది. మ్యాచ్ తొలి నిమిషంలోనే హోవార్డ్‌కు సవాలు ఎదురైంది. బెల్జియం ఫార్వర్డ్ ఒరిజి అందించిన పాస్‌ను డి బ్రూనే వేగంగా గోల్‌పోస్ట్‌లోకి పంపేందుకు చేసిన ప్రయత్నాన్ని హోవార్డ్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.
21వ నిమిషంలో బెల్జియం గోల్‌కీపర్ కోర్టయిస్ కూడా ఈ సవాలును విజయవంతంగా అధిగమించాడు. అమెరికా కెప్టెన్ డెంప్సీ గోల్‌పోస్ట్ దిశగా పంపిన బంతిని కోర్టయిస్ అంతే వేగంగా వెనక్కి పంపించాడు. 29వ, 45వ నిమిషాల్లోనూ బెల్జియం ప్రయత్నాలకు హోవార్డ్ అడ్డుగోడగా నిలవగా మ్యాచ్ ప్రథమార్ధం గోల్హ్రితంగా ముగిసింది.
ద్వితీయార్ధంలో దూకుడు పెంచిన బెల్జియం బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ గోల్‌పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది. ప్రత్యర్థిని నిలువరించడంలో తమ డిఫెండర్లు విఫలమవుతున్నా.. ప్రతిసారీ అడ్డుగోడగా నిలిచిన హోవార్డ్ 71వ నిమిషంలో ఒంటికాలిపై డైవ్ చేస్తూ బంతిని ఆపిన తీరు మ్యాచ్‌కే హైలైట్.
నిర్ణీత సమయం ముగిసినా గోల్ కాలేదు. అదనపు సమయంలో మూడో (93వ) నిమిషంలోనే డి బ్రూనే.. అమెరికా రక్షణశ్రేణిని చాకచక్యంగా ఛేదించుకుంటూ హోవార్డ్‌కు అందకుండా బంతిని నెట్‌లోకి పంపించాడు. బెల్జియం శిబిరంలో ఆనందోత్సాహాలు నింపాడు.హోవార్డ్ వీరోచిత పోరాటం కొనసాగించినా.. అదనపు సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లుకాకు 105వ నిమిషంలో గోల్ చేశాడు.
రెండో అదనపు సమయంలో బరిలోకి దిగిన గ్రీన్ 107వ నిమిషంలో అమెరికాకు గోల్‌ను అందించినా అప్పటికే ఆలస్యమైంది.