
టైమ్ మేగజైన్ 'పర్సన్ ఆఫ్ ద వీక్'గా సచిన్
వీడ్కోలు మ్యాచ్ ఆడుతున్న భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. రాజకీయ, సినీ దిగ్గజాల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్న మాస్టర్ తాజాగా.. ప్రతిష్టాత్మక టైమ్ మేగజైన్ 'పర్సన్ ఆఫ్ ద వీక్'గా ఎంపికయ్యాడు.
టైమ్ మేగజైన్ నిర్వహించిన ఆన్లైన్ పోల్లో నెటిజెన్లు మాస్టర్కు పట్టం కట్టారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జనెత్ యెలెన్ పోటీపడినా సచిన్కు ప్రథమ స్థానం దక్కింది. మాస్టర్ దాదాపు 88 శాతం ఓట్లు కైవసం చేసుకోవడం విశేషం. అమెరికాలో ప్రముఖ వార్తాపత్రికలు సచిన్ కథనాలను ప్రచురించాయి. టైమ్ మేగజైన్ కూడా ముంబైకర్ కెరీర్కు సంబంధించి పది చిరస్మరణీయ ఘట్టాలతో కూడిన కథనం ప్రచురించింది.
ముంబైలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు, సచిన్ (74) ఇన్నింగ్స్పై అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఈ మ్యాచ్ అనంతరం మాస్టర్ రిటైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైకర్కు క్రీడాప్రపంచంతో పాటు అన్ని రంగాల వ్యక్తుల నుంచి వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తున్నాయి.