
కోహ్లి సహా అందరూ విఫలం
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 135 ఆలౌట్
ఆస్ట్రేలియా ‘ఎ’తో రెండో అనధికార టెస్టు
చెన్నై: శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో... ఫామ్ కోసం భారత్ ‘ఎ’ మ్యాచ్‌లో బరిలోకి దిగిన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి (16) నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు బౌలర్లను ఎదుర్కొలేక తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కరణ్ నాయర్ (153 బంతుల్లో 50; 5 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలం కావడంతో ఆసీస్‌తో బుధవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 68.5 ఓవర్లలో 135 పరుగులకు కుప్పకూలింది. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ముకుంద్ (15), కెప్టెన్ పుజారా (11)లు శుభారంభాన్నివ్వలేకపోయారు. నెల రోజుల విశ్రాంతి తర్వాత బరిలోకి దిగిన కోహ్లి ఆసీస్ కుర్ర బౌలర్లను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. స్పిన్నర్ ఎగర్ వేసిన స్ట్రెయిట్ బంతిని ఆడలేక వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.తర్వాత నాయర్ నిలకడను చూపినా... వరుస విరామాల్లో శ్రేయస్ అయ్యర్ (1), నమన్ ఓజా (10)లు అవుట్‌కావడంతో భారత్ 109 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే టీ సెషన్ తర్వాత నాయర్ కూడా అవుట్ కావడంతో భారత్ వేగంగా పతనమైంది.
లోయర్ ఆర్డర్‌లో ఒక్కరు కూడా ఆదుకునే ప్రయత్నం చేయకపోవడంతో టీమిండియా 11.5 ఓవర్లలో 26 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. ఆసీస్ బౌలర్లలో సంధూ 3, ఫికిటి, కీఫీ, ఎగర్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్యాంకాఫ్ట్ ్ర(24 బ్యాటింగ్), ఖాజా (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
నల్ల బ్యాండ్లతో...
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా ఇరుజట్ల ఆటగాళ్లు భుజానికి నల్లని బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్‌కు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు.