'విరాట్ కోహ్లీది సెపరేట్ స్టైల్'
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు .ప్రపంచ క్రికెటర్లలో విరాట్ ఒక సెపరేట్ స్టైల్తో దూసుకుపోతూ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నాడని కొనియాడాడు. అతని ప్రత్యేక శైలే విరాట్ ను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఏ దశలోనైనా అతను పోరాడి తీరు నిజంగా అద్భుతమన్నాడు. 'విరాట్ ఏ బౌలర్ను క్షమించే నైజం కాదు. అతను క్రీజ్లో ఉన్నాడంటే గెలుపుకోసమే శ్రమిస్తాడు. పరిస్థితులను అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రతిభ విరాట్ కు పుష్కలంగా ఉంది. ఏనాటికైనా ప్రపంచ బెస్ట్ కెప్టెన్లలో విరాట్ ఒకడిగా నిలుస్తాడు' అని బీసీసీఐ మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ అభినందించాడు.
దీంతోపాటు భారత్ క్రికెట్ జట్టుకు 1983లో తొలి వరల్డ్ కప్ అందించిన ఆనాటి కెప్టెన్ కపిల్దేవ్ను శ్రీకాంత్ కొనియాడాడు. కపిల్ దేవ్ది ఎప్పుడూ సానుకూల ధోరణితో ముందుకువెళ్లేవాడన్నాడు. కపిల్ దేవ్ తనకంటూ భిన్నమైన శైలిని సృష్టించుకుని బౌలింగ్లో రాణించేవాడన్నాడు. అవతలి బ్యాట్స్మెన్ ఎవరు అనే దానిపై కపిల్దేవ్ బాగా కసరత్తు చేసి విజయవంతమయ్యాడని శ్రీకాంత్ ప్రశంసించాడు.