
ఇది 'విరాట్ కబాలి'!
ఆంటిగ్వా: భారీ అంచనాలతో విడుదలైన చిత్రం కబాలి. అటు రజనీకాంత్ మేనియా, ఇటు అభిమానుల అమితోత్సాహం ఈ సినిమాపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైన కబాలి మూవీ రికార్డు కలెక్షన్లపై ఇప్పటికే హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్సే అవకాశం ఉందని కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుండగా, నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కబాలి మూవీ గురించి చర్చించుకుంటున్నారు.
రజనీకాంత్ తన అభిమానులకు కబాలి మూవీ చూపిస్తుంటే.. విండీస్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లి కబాలి చూపిస్తున్నాడని సరదగా ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. తొలి రోజ మొదటి ఇన్నింగ్స్లో కోహ్లి 143 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో సినిమా టాపిక్ ను క్రికెట్ కు జత చేశారు. ఇది 'విండీస్ లో విరాట్ కబాలి' అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తున్నారు. కబాలి సినిమా విడుదలైనా.. ఇంకా విండీస్ను మాత్రం కోహ్లి విడిచిపెట్టలేదంటూ ఛలోక్తులు విసురుతున్నారు.
మన దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా కబాలి సినిమా-విరాట్ విధ్వంసాన్ని పోల్చుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఈ రోజుల తనను మూడు 'లీ'లు ఆకట్టుకున్నాయి. ఒకటి కోహ్లి ఇన్నింగ్స్ చూడటం, రెండో మూలీ(పరోటా) తినడం, మూడు కబాలి మూవీని ఆస్వాదించడం అంటూ చమత్కరించాడు.