కావాలి సమ్ క్రాంతి | Virat Kohli on verge of breaking AB de Villiers' world record vs Australia | Sakshi
Sakshi News home page

కావాలి సమ్ క్రాంతి

Published Fri, Jan 15 2016 12:00 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

కావాలి సమ్ క్రాంతి - Sakshi

కావాలి సమ్ క్రాంతి

భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే నేడు 
గాబాలో ఫ్లాట్ పిచ్ సిద్ధం 
వరుణుడు అడ్డుపడే అవకాశం


భారత జట్టు ఆస్ట్రేలియాపై వారి దేశంలో విజయం సాధించి నాలుగేళ్లయింది. 2012 ఫిబ్రవరిలో అడిలైడ్‌లో జరిగిన వన్డేలో ధోని లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత కంగారూలను వాళ్ల గడ్డపై ఎప్పుడూ ఓడించలేదు.
 
  ఈసారి తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా విజయం మాత్రం అందలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్‌లో ఓడితే ఇక సిరీస్‌లో కోలుకోవడం చాలా కష్టం. అందుకే నేడు జరిగే రెండో వన్డేలో గెలిస్తే ధోనిసేనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి సంక్రాంతి రోజైనా భారత శిబిరంలో విజయ క్రాంతి కనిపిస్తుందా..!
 
 బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో బౌన్స్, పేస్ ఉండే వికెట్లపై బ్యాటింగ్ చేయడం కష్టమనే అంచనాతో సిరీస్‌ను ప్రారంభించిన భారత జట్టు తొలి వన్డేలో బ్యాట్స్‌మెన్ ప్రదర్శనతో పూర్తిగా సంతృప్తి చెందింది. అనూహ్యంగా వికెట్ కొంత ఫ్లాట్‌గా మారడంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు చుక్కలు కనిపించాయి.
 
  భారత స్పిన్నర్లు ఘోరంగా విఫలమైతే... పేసర్లు కూడా ఆకట్టుకోలేకపోయారు. నేడు (శుక్రవారం) గాబా మైదానంలో జరిగే రెండో వన్డేకు అంతకంటే ఫ్లాట్ పిచ్ కనిపిస్తోంది. కాబట్టి కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌కు ఇది పండగే. బౌలర్ల కారణంగా తొలి వన్డే ఓడిపోయిన ధోనిసేన... ఈ ఫ్లాట్ పిచ్‌పై గెలవాలంటే ఏం చేయాలి? బౌలింగ్ కూర్పు ఎలా ఉండాలి? ఇలా అనేక ప్రశ్నల నడుమ రెండో వన్డేకు సిద్ధమైంది.
 
 ఇషాంత్‌కు అవకాశం
 తొలి వన్డేలో బ్యాట్స్‌మెన్ బాగా ఆడినందున ఈ మ్యాచ్‌లోనూ ఈ విభాగంలో మార్పులేమీ ఉండవు. అయితే అదనపు బౌలర్ కావాలని అనుకుంటే మాత్రం మనీష్ పాండే స్థానంలో గుర్‌కీరత్ లేదా రిషి ధావన్‌లలో ఒకరిని ఆడించాలి. ఈ ఇద్దరూ ఆల్‌రౌండర్లే కాబట్టి బ్యాటింగ్ గురించి కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదు. బౌలింగ్ విభాగంలో మాత్రం మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇషాంత్ శర్మ మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడని జట్టు తెలిపింది. అంటే తను తుది జట్టులోకి రావడం ఖాయం. మరి భువనేశ్వర్‌ను తీసి ఆడిస్తారా? లేక ఒక స్పిన్నర్‌ను తగ్గిస్తారా అనేది తేలాల్సి ఉంది. అశ్విన్, జడేజా ఇద్దరిపైనా ధోనికి నమ్మకం ఎక్కువ.
 
 
  వికెట్ కూడా ఫ్లాట్‌గా ఉన్నందున ఈ ఇద్దరినీ ఆడించొచ్చు. పేస్ కారణంగా ఉమేశ్‌ను తీయకపోవచ్చు. ఇక తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్న బరిందర్ కూడా తుది జట్టులో ఉంటాడు. మొత్తం మీద తొలి వన్డేతో పోలిస్తే తుది జట్టు ఎంపికలో మరింత గందరగోళం ఉంది.
 
 ఓపెనర్‌గా షాన్ మార్ష్
 తన భార్య ప్రసవం కారణంగా ఓపెనర్ వార్నర్ సెలవు తీసుకోవడంతో... షాన్‌మార్ష్ తుది జట్టులోకి వచ్చాడు. ఫించ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మిడిలార్డర్‌లో, బౌలింగ్ లైనప్‌లోనూ పెద్దగా మార్పులు ఉండవు. రొటేషన్ పాలసీలో భాగంగా మిషెల్ మార్ష్‌కు విశ్రాంతి ఇచ్చినందున... అతని స్థానంలో కేన్ రిచర్డ్‌సన్ లేదా హ్యాస్టింగ్స్‌లలో ఒకరు జట్టులోకి వస్తారు. తొలి వన్డేలో విఫలమైనా కొత్త బౌలర్లు పారిస్, బోలాండ్ తుది జట్టులో ఉంటారు
 
 . 310 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించే క్రమంలో కెప్టెన్ స్మిత్, మాజీ కెప్టెన్ బెయిలీ ఆడిన ఇన్నింగ్స్‌లు ఆస్ట్రేలియా శిబిరంలో ఉత్సాహం పెంచాయి. ఈ వన్డేలోనూ గెలిస్తే తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా సిరీస్ దక్కుతుంది. కాబట్టి ఇక్కడ విజయం సాధించి భారత్‌ను ఒత్తిడిలో పడేయవచ్చనేది కంగారూల వ్యూహం.
 
 జట్లు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రహానే, పాండే / గుర్‌కీరత్/ రిషి ధావన్, అశ్విన్, జడేజా, ఇషాంత్, ఉమేశ్, బరిందర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, షాన్ మార్ష్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, వేడ్, ఫాల్క్‌నర్, రిచర్డ్‌సన్ / హ్యాస్టింగ్స్, బోలాండ్, పారిస్, హాజిల్‌వుడ్.
 
 8 గాబాలో భారత్ వన్డే గెలిచి ఎనిమిది సంవత్సరాలయింది.
 2008లో ఆసీస్‌పై గెలిచాక ఇక్కడ ఆడిన 3 వన్డేల్లో ఓడింది.

 
 2 ఆసీస్‌తో ఈ మైదానంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ 2 గెలిచింది.
 
 పిచ్, వాతావరణం
 పిచ్ ఫ్లాట్‌గా కనిపిస్తోంది. భారీస్కోర్లు రావడం ఖాయమని అంచనా. డేనైట్ మ్యాచ్‌లో మధ్యాహ్నం ఎండ బాగానే ఉంటుంది. సాయంత్రం నుంచి వర్షం పడే అవకాశం ఉంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున లక్ష్యాన్ని ఛేదించడమే ఉత్తమం.
 
 ఉదయం గం. 8.50 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement