గత 50 ఏళ్లలో లక్ష్మణ్‌దే ఉత్తమ ఇన్నింగ్స్
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్‌కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈడెన్ గార్డెన్స్ (2001)లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న తీరు ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. అందుకే గత 50 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శనగా లక్ష్మణ్ ఆడిన ఈడెన్ ఇన్నింగ్స్‌కు గుర్తింపు దక్కింది. ఈఎస్‌పీఎన్ డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌కే మెజారిటీ సభ్యులు ఓటేశారు.
పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్, జర్నలిస్ట్‌లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఐదు దశాబ్దాలలో 50 అత్యుత్తమ ప్రదర్శనలను ఓట్ల ద్వారా ఎంపిక చేశారు. 1981లో ఆస్ట్రేలియాపై ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్) ప్రదర్శన రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా 50 ఉత్తమ ప్రదర్శనలలో బ్రియాన్ లారా (వెస్టిండీస్) ఆడిన ఇన్నింగ్స్ నాలుగు ఉన్నాయి. బోథమ్, రిచర్డ్స్ (వెస్టిండీస్)లవి మూడు ప్రదర్శనలు ఉన్నాయి. గవాస్కర్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌కు కూడా ఈ టాప్-50 ప్రదర్శన జాబితాలో చోటు దక్కింది.