
ముంబై: శ్రీలంకతో ఇక్కడ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మూడో టీ 20 ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోఅరంగేట్రం చేసిన భారత బ్యాటింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరపున అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ టీ20ల్లోకి ప్రవేశించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 18 ఏళ్ల 80 రోజుల వయసులో సుందర్ అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. తద్వారా రిషబ్ పంత్(19 ఏళ్ల 120 రోజులు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. ఇక్కడ ఇషాంత్ శర్మ(19 ఏళ్ల 152 రోజులు), సురేశ్ రైనా(20 ఏళ్ల 4రోజులు)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది నామ మాత్రపు మ‍్యాచ్ కావడంతో ప్రధాన బౌలర్లు చాహల్, బూమ్రాలకు విశ్రాంతి నిచ్చారు. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్, మొహ్మద్ సిరాజ్‌లు తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. తొలి టీ 20లో భారత్ జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో సిరీస్‌ను భారత జట్టు 2-0తో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment