మనోళ్ళే ముద్దు | Watson goes for whopping 9.5 cr, Negi emerges costliest Indian buy | Sakshi
Sakshi News home page

మనోళ్ళే ముద్దు

Published Sun, Feb 7 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

మనోళ్ళే ముద్దు

మనోళ్ళే ముద్దు

దేశవాళీ క్రికెటర్లపై కాసుల వర్షం  స్టార్ క్రికెటర్లకు తగ్గిన రేటు
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన 94 మంది క్రికెటర్లు
యువరాజ్ కంటే పవన్ నేగీకి ఎక్కువమొత్తం 
అందరికంటే ఎక్కువగా వాట్సన్‌కు రూ.9.5 కోట్లు

గత ఏడాది వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం అంటే కాసుల వర్షం... పేరున్న ప్రతి క్రికెటర్‌కూ భారీగా డబ్బులు వచ్చేవి. కానీ ఈసారి ట్రెండ్ మారింది. ఫ్రాంచైజీలు ఆచితూచి డబ్బు ఖర్చు చేశాయి. కోట్లు పోసి విదేశీ క్రికెటర్లను తెచ్చి బెంచ్‌లపై కూర్చోబెట్టడం అనవసరమనే భావనతో వ్యవహరించాయి. దేశవాళీ క్రికెట్‌లో కొద్దోగొప్పో ఆడేవాళ్లపై కూడా కాసుల వర్షం కురిపించారు. అనామకులైనప్పటికీ నైపుణ్యం ఉందని భావించిన వాళ్లకోసం కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద ఈసారి వేలంలో గతంతో పోలిస్తే స్టార్ క్రికెటర్లకు నిరాశ ఎదురైనా... దేశవాళీ ఆటగాళ్ల జేబులు నిండాయి.

బెంగళూరు: గత రెండు సీజన్ల వేలంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లందరికీ నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితం బెంగళూరు రూ. 14 కోట్లు... ఏడాది క్రితం వేలంలో ఢిల్లీ రూ. 16 కోట్లు ఇచ్చి కొనుక్కున్న యువరాజ్‌ను... ఈసారి కేవలం రూ.7 కోట్లకే హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు సొంతం చేసుకుంది. గత ఏడాది ఏకంగా రూ. 12 కోట్లు దక్కించుకున్న దినేశ్ కార్తీక్ ఈసారి కేవలం రూ. 2 కోట్ల 30 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ క్రికెటర్ కోసమూ భారీగా వెచ్చించడం అనవసరమనే భావనలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. వేలానికి వచ్చే సమయానికే ప్రతి జట్టులోనూ కావలసినంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు.

కాబట్టి విదేశీ స్టార్‌ల కోసం వెంపర్లాడే బదులు... దేశవాళీ క్రికె ట్‌లో నిలకడగా ఆడిన, సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లకు అన్ని ఫ్రాంచైజీలు పెద్ద పీట వేశాయి. ఇప్పటివరకూ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పవన్ నేగీకి ఏకంగా రూ. 8.5 కోట్లు లభించాయి. ఇది యువరాజ్ సింగ్ కంటే ఎక్కువ కావడం చెప్పుకోదగ్గ విశేషం. అలాగే సంజు శామ్సన్ (రూ. 4.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 4 కోట్లు), దీపక్ హుడా లాంటి దేశవాళీ క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో చక్కగా బౌలింగ్ చేసిన తమిళనాడు లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌కు ఏకంగా రూ. 4.5 కోట్లు దక్కడం విశేషం.

వేలం హైలైట్స్
రెండేళ్ల నుంచి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న కెవిన్ పీటర్సన్ మొదట వేలంలోకి వచ్చాడు. ఇతనికోసం పుణే, గుజరాత్ మాత్రమే పోటీపడ్డాయి. డ్వేన్ స్మిత్, ఇషాంత్ శర్మల కోసం కూడా గుజరాత్, పుణేలు పోటీపడినా.. మధ్యలో వేరే ఫ్రాంచైజీలు రావడంతో ధర కాస్త పెరిగింది.

టెస్టులకు గుడ్‌బై చెప్పిన ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాలుగో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. ఇక అన్ని ఫ్రాంచైజీలు ఈ ఆల్‌రౌండర్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. బెంగళూరు రూ. ఐదున్నర కోట్లకు తీసుకెళ్లడంతో పుణే వెనక్కితగ్గింది. అయితే ముంబై రాకతో రేట్ అమాంతం పెరిగింది. చివరకు బెంగళూరు రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

యువరాజ్ వేలానికి వచ్చినప్పుడు ఫ్రాంచైజీలు బాగా తటపటాయించాయి. అయితే 2 కోట్లతో ముంబై వేలాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ. 5 కోట్ల తర్వాత బెంగళూరు పక్కకు తప్పుకోగా ముంబై దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లింది. చివరకు రూ. 6 కోట్ల వద్ద ఆలస్యంగా వేలంలోకి వచ్చిన హైదరాబాద్ మరింత పెంచి సొంతం చేసుకుంది.

 ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను మొదట వేలంలో ఎవరూ తీసుకోలేదు. కానీ రెండోసారి రావడంతో  రూ. 1 కోటి బేస్‌ప్రైస్‌కే గుజరాత్ లయన్స్ దక్కించుకుంది.

గతేడాది కోట్లలో పలికిన స్పిన్నర్ అమిత్ మిశ్రా పరిస్థితి ఈసారి ఘోరంగా మారింది. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయాడు.

 మొత్తం 351 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటే... ఫ్రాంచైజీలు 94 మందిని మాత్రమే తీసుకున్నాయి. ఓవరాల్‌గా 257 మందికి నిరాశ ఎదురైంది.

 భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా పని చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు.

 ఓవరాల్‌గా వేలంలో తీసుకున్న ఆటగాళ్లలో భారత్‌కు ఆడిన ప్లేయర్లు 15, దేశవాళీ క్రికెటర్లు 51, ఆసీస్ నుంచి 13, దక్షిణాఫ్రికా నుంచి 4, వెస్టిండీస్ నుంచి 4, ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నారు.

అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్ల వైపు కూడా ఫ్రాంచైజీలు బాగానే మొగ్గు చూపాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఇషాన్ కిషన్‌ను రూ. 35 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఇక రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 1.9 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది.

సెలబ్రిటీలు నీతా అంబానీ (ముంబై), ప్రీతి జింతా (పంజాబ్), విజయ్ మాల్యా (బెంగళూరు), మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్, మూడీ, బ్రాడ్ హాడ్జ్, వెటోరి తమ ఫ్రాంచైజీల    తరఫున వేలంలో పాల్గొన్నారు. 

తమ్ముడికి రెండు కోట్లు!
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు క్రునాల్ హిమాన్షు పాండ్యా, కర్ణాటక ఆటగాడు కిశోర్ కామత్ కోసం ఫ్రాంచైజీలు ఊహించని రీతిలో డబ్బుల వర్షం కురిపిం చాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఈ ఇద్దరి కోసం ముంబై, ఢిల్లీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు క్రునాల్‌ను రూ. 2 కోట్లకు, కామత్‌ను రూ. 1.4 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల క్రునాల్ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు. ఐపీఎల్ లెక్కల ప్రకారం ముంబై ఇండియన్స్ హార్దిక్‌కు రూ.10 లక్షలు చెల్లిస్తుండగా... అదే ముంబై క్రునాల్‌కు రూ.2 కోట్లు ఇవ్వబోతోంది. మరోవైపు కిశోర్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడాడు. రాష్ట్ర జట్టుకుగానీ, అండర్-17, 19 జట్లకుగానీ ప్రాతినిధ్యం వహించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement