అంటిగ్వా: ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(81నాటౌట్; 63 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్) ఒంటరి పోరాటంతో అదరగొట్టిన టీమిండియా-ఏకు ఓటమి తప్పలేదు. వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్లు తొలి ఓటమి నమోదు చేసింది. ఇప్పటికే మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నాలుగో వన్డేలో ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విండీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. కృనాల్ పాండ్యా(45) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో కీమో పాల్, పావెల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(84; 100 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు), థామస్(70; 95 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు), కార్టర్(50; 43 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో టీమిండియా ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లతో రాణించగా.. అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment