లండన్: క్రికెట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సహకరించాలనే కారణంతోనే తమ వైపునుంచి ఆడేందుకు సిద్ధమయ్యామని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కారణంగా తీవ్రమైన పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో విండీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లటం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇదో సాహసంగా తాము భావించడం లేదని, డబ్బులు కూడా అందుకు కారణం కాదని హోల్డర్ వ్యాఖ్యానించాడు. కరోనా కారణంగా ఒక్క ఇంగ్లండ్‌లోనే సుమారు 30 వేల మంది మృత్యువాత పడ్డారు.
మాపై ప్రయోగాలు చేయించుకోవడానికి మేమేమీ ‘గినియా పిగ్’లం కాదు. ఎంతో మంది ఇప్పుడు క్రికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మేం ఇక్కడ ఆడటానికి రాలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు మాకు హామీ ఇచ్చారు. వాటి పట్ల సంతృప్తిగా ఉన్నాం. సిరీస్ ఆడటానికి డబ్బులు కారణం కాదు. హెల్త్ కేర్ వర్కర్లు ఇలాంటి విపత్తు సమయంలో అన్నింటికీ తెగించి పని చేస్తున్నారు. మనం అంత ప్రమాదంలోనైతే లేము కదా. అయినా ఏదో ఒక దశలో సాధారణ పరిస్థితులు తీసుకు రావాలంటే మొదటి అడుగు వేయాల్సిందే’ అని హోల్డర్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఉన్న వెస్టిండీస్ జట్టు మూడు వారాల హోం క్వారంటైన్ అనంతరం జూలై 8నుంచి జరిగే తొలి టెస్టు కోసం సౌతాంప్టన్ వెళుతుంది.
Comments
Please login to add a commentAdd a comment