'ఐపీఎల్.. ఆ విధ్వంసం నుంచి అప్పుడే కోలుకోలేం'
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీల సునామీ ఇన్నింగ్స్ ను త్వరగా మరిచిపోవాలని గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అంటున్నాడు. విరాట్(109; 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), డివిలియర్స్(129 నాటౌట్; 52 బంతుల్లో 10ఫోర్లు, 12 సిక్సర్లు) తమ బ్యాటింగ్ తో గుజరాత్ బౌలర్లకు శనివారం జరిగిన మ్యాచ్ లో చుక్కలు చూపించారు. అనంతరం బౌలర్లు కూడా చెలరేగడంతో గుజరాత్ కేవలం 104 పరుగులకే కుప్పకూలి, 144 పరుగుల భారీ ఓటమిని మూట కట్టుకుంది. దీంతో ఐపీఎల్ ఏ సీజన్లలో అయినా చెత్త ఒటమి రికార్డు గుజరాత్ ఖాతాలో పడింది.
విరాట్, డివిలియర్స్ లు చెలరేగడంతో తామేం చేయలేకపోయామని, వారిని నిలువరించక పోవడంతో బెంగళూరు తమ ముందు 249 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిందని చెప్పాడు. అయితే ఇలాంటి విధ్వసక ఇన్నింగ్స్ ఎప్పుడో గానీ ఎదురవ్వవని అభిప్రాయపడ్డాడు. బ్యాక్ ఫుట్ పై ఉండి షాట్లు కొట్టడం చాలా అరుదు.. కానీ డివిలియర్స్ మాత్రం బ్యాక్ ఫుట్ తీసుకుని అలవోకగా బంతులను సిక్సర్లుగా మలచటంతో మైండ్ బ్లాంక్ అయిందని పేర్కొన్నాడు. తమ తర్వాతి మ్యాచ్ కు ఐదు రోజుల విరామం ఉందని, ఈ భారీ ఓటమి క్షణాల నుంచి బయటపడేందుకు మంచి అవకావమని కార్తీక్ అంటున్నాడు.