లండన్: టెన్నిస్ టోర్నీల్లో బాల్ బాయ్స్, బాల్‌గర్ల్స్ కీలకంగా వ్యవహారిస్తుంటారు. టెన్నిస్ ఆటగాళ్లు కొట్టిన సర్వ్‌లకు బంతి బయటకు వెళ్లినా.. కోర్టులో పడినా పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టిన బంతులు తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సంఘటనే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో బుధవారం చోటు చేసుకుంది. ఉబ్బెకిస్తాన్ ప్లేయర్ ఇస్టోమిన్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ ఒక బాల్‌గర్ల్‌కు తగిలింది.
217 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి తగలడంతో నొప్పి తట్టుకోలేకపోయిన ఆ బాల్ గర్ల్ వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో, ఇస్టోమిన్‌తో పాటు కిర్గియోస్ ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చారు. ‘ బంతి తగిలిన శబ్ధాన్ని నేను విన్నాను. అయితే స్కోరు బోర్డును తాకిందని అనుకున్నా. ఆ తర్వాత ఆమె చేతికి తగిలిందనే విషయం అర్ధమైంది. దాంతో ఆమె ఏడ‍్చేసింది. నాకు తగిలినా ఏడ్చేసేవాడిని. ఇది చాలా బాధాకరం. ఆమె ఒక చాంపియన్. త్వరగా ఆమె కోలుకుని ఎప్పటిలాగే విధులకు హాజరవుతుందని ఆశిస్తున్నా’ అని మ్యాచ్ తర్వాత కిర్గియోస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment