రోజర్ ఫెడరర్
మోంటేకార్లో (మొనాకో): టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటలోనే కాదు అవార్డుల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డులను ఈ ఏడాది ఒకటి కాదు... రెండు గెలుచుకున్నాడు. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’... ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. మరో టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ చేతుల మీదుగా అతను ఈ పురస్కారాలను అందుకున్నాడు. ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం రేసులో క్రిస్టియానో రొనాల్డో (పుట్‌బాల్), మో ఫరా (అథ్లెటిక్స్), లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్), రాఫెల్ నాదల్ (టెన్నిస్) కూడా ఉన్నప్పటికీ ఫెడరర్‌నే ఈ అవార్డు వరించింది. 36 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్’ 2016లో ఎదురైన గడ్డు పరిస్థితులు, వరుస వైఫల్యాలు, గాయాలను అధిగమించి... 2017లో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు ఏడు ట్రోఫీలను గెలిచాడు.
దీంతో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ (ఈ ఏడాది) సాధించాడు. ఈ వెటరన్ చాంపియన్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు రావడం కొత్తేమీ కాదు. జోరుమీదున్న కెరీర్ తొలినాళ్లలోనే 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్ ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా ఫెడరర్ మాట్లాడుతూ ‘ప్రతిష్టాత్మక అవార్డును మళ్లీ అందుకోవడం ఆనందంగా ఉంది. పునరాగమంలో ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. గతేడాది నాకెంతో కలిసొచ్చింది. నా కలల్ని సాకారం చేసుకునేందుకు సహకరించింది. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న క్లిష్టమైన ప్రత్యర్థి రాఫెల్ నాదలే. అతనో అద్భుతమైన ఆటగాడు’ అని అన్నాడు. ప్రస్తుతానికైతే రిటైర్మెంట్‌పై ఆలోచించడం లేదన్నాడు. ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అందుకుంది. అమెకిది నాలుగో అవార్డు. గతంలో 2003, 2010, 2016లో మూడుసార్లు ఈ పురస్కారం అందుకుంది. గతేడాది ఆరంభంలో వారాల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా నల్లకలువ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment