
యాసిర్ షాపై మూడు నెలల నిషేధం
దుబాయ్:గతేడాది చివర్లో డోపింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై మూడు నెలల నిషేధం పడింది. యాసిర్ షా డోపీగా తేలడంతో అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. యాసిర్ డోపింగ్ పాల్పడిన అనంతరం నిర్వహించిన టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అప్పుడే అతన్ని తాత్కాలికంగా సస్పండ్ చేస్తూ ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) నిర్ణయం తీసుకుంది.
కాగా, అతను మూడు నెలల పాటు సస్పెండ్ గురైనట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వర్గాలు ఆదివారం అంగీకరించాయి. యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్ క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడం కావడంతో యాసిర్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు.