మరో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా... | Zimbabwe in the first match today | Sakshi
Sakshi News home page

మరో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...

Published Fri, Jun 17 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

మరో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...

మరో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...

టి20 సిరీస్‌పై భారత్ దృష్టి
జింబాబ్వేతో నేడు తొలి మ్యాచ్
జోరు మీదున్న ధోని సేన
 

 
భారత్, జింబాబ్వే వన్డే సిరీస్ ప్రహసనం ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆట టి20లకు మారింది. వన్డేల్లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన ధోని సేన ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ అదే దూకుడుకు సిద్ధమైంది. వన్డేలతో పోలిస్తే గత సిరీస్‌లో ఒక టి20 మ్యాచ్‌లో   భారత్‌ను ఓడించడమే జింబాబ్వే జట్టులో స్ఫూర్తి నింపే అంశం. బలాబలాల పరంగా ఇరు జట్ల మధ్య భారీ అంతరం ఉండగా... అనిశ్చితిలాంటి టి20 క్రికెట్‌లో జింబాబ్వే ఏదైనా సంచలనం సృష్టిస్తుందో లేక ఎప్పటి లాగే సాగిలపడుతుంతో చూడాలి.
 
 
హరారే:  టి20 క్రికెట్ గురించి భారత కొత్తతరం ఆటగాళ్లకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న  ధోని సేనలో ఫజల్ మినహా మిగతా 15 మంది ఇటీవలి వరకు ఐపీఎల్‌లో ధనాధన్ క్రికెట్ ఆడుతూనే వచ్చారు. ఈ ఫార్మాట్‌లో వారికి చెప్పుకోదగ్గ అనుభవమే వచ్చేసింది. ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తు చేసే ఆత్మవిశ్వా సం వారిలో కనిపిస్తోంది. ఇలాంటి జట్టుతో తలపడేందుకు జింబాబ్వే సొంతగడ్డపై సన్నద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఘోరంగా ఓడిన ఆ జట్టు కనీసం ఇప్పుడైనా రాణించి పరువు నిలబెట్టుకోవాలని భావి స్తోంది. ఈ నేపథ్యంలో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి మ్యాచ్ జరుగుతుంది.


 మార్పులు ఉంటాయా..?
 వన్డే సిరీస్‌లో ఫామ్, అంతకు ముందు ఐపీఎల్ ఆట ప్రకారం చూస్తే ధోని ఎలాంటి మార్పులు లేకుండానే టి20 మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మొత్తం 16 మంది సభ్యులలో ముగ్గురు మినహా మిగతావారికి మ్యాచ్ దక్కింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని మన్‌దీప్ సింగ్, జయంత్ యాదవ్ చాన్స్ కోసం ఎదురు చూస్తుండగా, ఉనాద్కట్ కూడా మ్యాచ్ ఆడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి కనీసం ఇద్దరిని తుది జట్టులో ఎంపిక చేసేందుకు కూడా అవకాశం ఉంది. రాహుల్‌తో మరో ఓపెనర్‌గా మన్‌దీప్ రావచ్చు. ఇంకా మిగతా బ్యాటింగ్ ఆర్డర్ మనీశ్ పాండే, రాయుడు, ధోని, జాదవ్‌లతో పటిష్టంగా ఉంది.

బౌలింగ్‌లో ధావల్, బుమ్రా ఖాయం కాగా బరీందర్ స్థానంలో ఉనాద్కట్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను తొలి మ్యాచ్ ఆడించాలంటే ఇద్దరు స్పిన్నర్లు చహల్, అక్షర్‌లలో ఒకరిని పక్కన పెట్టాలి. అయితే ఈ చిన్న చిన్న మార్పులు చేసినా ఓవరాల్‌గా జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు. కాబట్టి మరోసారి భారత్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. మూడు వన్డేల్లో బ్యాట్ పట్టని ధోని మెరుపులు టి20ల్లోనైనా చూడాలని ఆశిస్తున్న అభిమానుల కోసమైనా అతను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వస్తాడా అనేది వేచి చూడాలి.


సవాలక్ష సమస్యలు
జింబాబ్వే జట్టు టెస్టు క్రికెట్ ఆడి చాలా కాలమైంది. వన్డేల్లో ఆట ఎలా ఉందో తాజా సిరీస్‌లో కనిపిం చింది. ఇక ఆ జట్టు ఏ మాత్రమైనా ప్రభావం చూపగలిగి, తమ దేశంలో క్రికెట్‌ను బ్రతికించుకోవాలంటే కనీసం టి20ల్లోనైనా చెప్పుకోదగ్గ విధంగా రాణించాల్సి ఉంది. ఈ ఫార్మాట్ వారికి కొంత వరకు ఆ అవకాశం కల్పిస్తోంది. అయితే ఇక్కడా ఆ జట్టు రికార్డు గొప్పగా లేకపోయినా వన్డేలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. గత రెండేళ్లలో బంగ్లాదేశ్‌తో రెండు సిరీస్‌లను డ్రా చేసుకున్న ఆ జట్టు, భారత్‌పై కూడా ఒక మ్యాచ్ గెలిచింది.

నాటి మ్యాచ్‌లో ఆడిన సగం మంది ప్రస్తుత జింబాబ్వే జట్టులో ఉన్నారు. మసకద్జ, చిగుంబురా, రజా, చిబాబాల బ్యాటింగే ఆ జట్టును ఆదుకోవాల్సి ఉంది. అయితే కీలక ఆటగాళ్లు విలియమ్స్, ఇర్విన్ గాయంతో టి20లకు కూడా దూరం కావడం ఆ జట్టును మరింత ఇబ్బంది పెడుతోంది. వన్డేలతో పోలిస్తే ఈ మ్యాచ్‌లు కాస్త ఆలస్యంగా ప్రారంభం అవుతుండటంతో ఆరంభంలో పేస్, స్వింగ్‌కు అనుకూలించే అవకాశం తక్కువ. కాబట్టి కాస్త మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేసేందుకు జింబాబ్వేకు అవకాశం ఉంటుంది.
 
 మ. గం. 3.30నుంచి టెన్-2లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement