ముదురుతున్న విద్యుత్ కిరికిరి
Published Thu, Feb 6 2014 11:57 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు కంపెనీలు కోర్టు బాటపట్టాయి. తమ పిటిషన్లను వీలైనంత త్వరగా విచారించాలని కోర్టును కోరాయి. వివరాల్లోకెళ్తే... ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ మరుసటి రోజే నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్న టాటా పవర్, బీఎస్‌ఈఎస్ రాజధాని, బీఎస్‌ఈఎస్ యమున సంస్థలకు సంబంధించిన లెక్కలను కాగ్‌తో అడిట్ జరిపించాలని నిర్ణయించారు. ఈ కాగ్ అధిపతిని కూడా కలిశారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడంతో టాటా పవర్ సంస్థ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దీనిపై కోర్టు తీర్పునిస్తూ.. ఆడిట్‌కు సహకరించాలని సూచించింది. దీంతో టాటా పవర్ హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
ఎన్టీపీసీ నోటీసుపై బీఎస్‌ఈఎస్..
బకాయిలు చెల్లించనట్లయితే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తానని హెచ్చరిస్తూ ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఇచ్చిన నోటీసును సవాలుచేస్తూ బీఎస్‌ఈఎస్ రాజధాని, బీఎస్‌ఈఎస్ యము న సుప్రీం కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాయి. తక్షణం విచారణ జరిపించవలసిందిగా కోరిన ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని ధర్మాసనంశుక్రవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన అంశం శుక్రవారం విచారణకు రానున్నందున తాము తాజాగా దాఖలు చేసే విజ్ఞప్తిపై కూడా దానితోపాటు విచారణ జరపాలని బీఎస్‌ఈఎస్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. అందుకు సుప్రీకోర్టు ధర్మాసనం అంగీకరించి శుక్రవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చింది. బకాయిలు చెల్లించనట్లయితే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తానని ఎన్టీపీసీ ఈ నెల 1న బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌లకు నోటీసు జారీచేసింది.
బకాయిల వసూలు కష్టమవుతోంది: టాటా
నగరంలో డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని టాటా పవర్ కంపెనీ అభిప్రాయపడింది. ఓవైపు బీఎస్‌ఈఎస్‌తో పోటీ వాతావరణం, మరోవైపు డిస్కమ్‌ల పట్ల ఆప్ ప్రభుత్వ వైఖరితో తమకు రావాల్సిన దాదాపు రూ. 5,000 కోట్లమేర బకాయిలు పేరుకుపోయాయని వాపోయింది. కాగా రిలయన్స్‌కు చెందిన బీఎస్‌ఈఎస్ వెంచర్ లెసైన్సును రద్దు చేసి, దానిని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్‌కు ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కారు భావి స్తోందన్న వార్తలపై ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి, తమకు మధ్య ఈ విషయమై అధికారికంగా ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపింది.
Advertisement
Advertisement