రాజకీయాల్లోకి వస్తా!
దేవుడు ఆదేశిస్తేనే...
అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తా
- రజనీకాంత్ సంచలన ప్రకటన
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా రజనీ రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదికోసారి అభిమానులను కలవడం అలవాటుగా పెట్టుకున్న రజనీకాంత్ కొన్నేళ్ల క్రితం దాన్ని నిలిపే శారు. అయితే సుదీర్ఘ విరామం తరువాత సోమవారం మళ్లీ సమావేశమయ్యారు. ఐదు రోజులపాటు జిల్లాల వారీగా అభిమానులను కలుసుకునే సమావేశాలు చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి రజనీ ప్రసంగించారు. 25 ఏళ్ల క్రితం ఒకసారి రాజకీయాలు మాట్లాడి తలనొప్పులు తెచ్చుకున్నానని, అప్పటి నుంచి తనను రాజకీయాలతో ముడిపె ట్టడం పరిపాటిగా మారిందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఎన్నికల్లోనూ తన పేరు వాడుకుంటున్నారని విమర్శిం చారు. దీంతో తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని తరచూ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అభిమానులైన మీరు రాజకీయాల్లో ఉండండి, అయితే రాజకీయాలను అడ్డుపెట్టుకుని సంపాదించాలని ఆశించకండని హితవు పలికారు. తన జీవితాన్ని దేవుడే నడిపిస్తున్నాడని, దేవుడు నన్ను రాజకీయాల్లోకి దింపితే స్వచ్ఛమైన హృదయం, శరీరంతో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించాలని ఆశించేవారిని దగ్గరికి రానీయనని స్పష్టం చేశారు. ఒకప్పుడు తాను అతిగా మద్యం తాగేవాడినని, పెద్దల సలహాతో మానివేశానని చెప్పారు. మద్యం తాగవద్దు, ఆస్తులు కోల్పోవద్దని హితవు పలికారు.
తొలిసారిగా చిహ్నం: అభిమానులతో రజనీ సమావేశం కొత్తకాకున్నా, ఈ సమావేశంలో వేదికపై అమర్చిన ఒక చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ‘బాబా’ చిత్రంలో రజనీకాంత్ తన కుడిచేతి వేళ్లను చిత్రంగా మడిచి చూపుతుంటారు. తెల్లని కలువపువ్వులో అదే తరహాలో చేతివేళ్లు చిహ్నంగా తీర్చిదిద్ది ఫ్లెక్సీలో అమర్చారు.