అంజలీదేవికి అంతిమ వీడ్కోలు
Published Thu, Jan 16 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి పాత్రలో జీవించిన అంజలి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు. ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.
మహోన్నత నటి
రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, అంజలీ దేవి భౌతికకాయాన్ని దర్శించి పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ జాతస్య మరణం ధృవం అన్నది సత్యం. అయితే మరణించిన తరువాత కూడా మన మధ్య చిరకాలం నిలిచిపోయే నటి అంజలీదేవి. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాత్రలకు జీవం పోసిన నటి. హిందీ, కన్నడం వంటి ఇతర భాషల్లో కొన్ని చిత్రాలు చేసినా అద్భుత నటిగా ఖ్యాతిగాంచారు. నేను గవర్నర్‌గా చెన్నైకి వచ్చిన తరువాత ఐదారుసార్లు అంజలీదేవిని కలిశాను. చివరి రోజుల్లో ఆమె ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. అలాంటి మహోన్నత నటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చెప్పారు.
అత్యంత ఆప్తురాలు
ప్రఖ్యాత నటి వైజయంతి మాల బాలి అంజలీదేవికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ, ‘‘అంజలీదేవి నాకు అత్యంత ఆప్తురాలు. ఏవీఎం సంస్థ నిర్మించిన పెణ్ (తెలుగు సంఘం) చిత్రంలో మేమిద్దరం కలిసి నటించిన అనుభవం మరపురానిది. ఆ చిత్రంలో నాకు అవకాశం రావడానికి కారణం అంజలినే. ఆమె చాలా స్నేహశీలి. మేము తరచు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. అంజలీదేవి 80వ జన్మదినోత్సవానికి నన్ను ఆహ్వానించారు. నేను వేడుకలో పాల్గొన్నాను. చాలా మధురమైన రోజది. అలాంటి గొప్ప నటి కన్నుమూయడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అంజలీ దేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు.
ఆది నుంచే అనుబంధం : సుశీల
‘‘అంజలీదేవితో నాకు మొదటి నుంచే అనుబంధం ఉంది. నేనే కార్యక్రమాన్ని తలపెట్టినా ఆమె సలహా తీసుకుంటాను. పుట్టపర్తి సాయిబాబా దర్శనం కూడా అంజలిదేవి సాయంతోనే కలిగింది. ఆమె కుటుంబంలో నేను ఒక సభ్యురాలినయినందుకు గర్వంగా ఉంది. అంజలిదేవి దైవ స్వరూపిణి. ఆమె ఆత్మ ఎప్పుడో భగవంతునిలో కలిసి పోయింది. అంజలి దేవిని చూసి నేర్చుకోవలసింది, ఆచరించవలసింది ఎంతో ఉంది అన్నారు.’’ ప్రఖ్యాత గాయని పి.సుశీల.
సినిమాకు పెద్ద ఆభరణం: బాలు
‘‘ముందుతరం వారు చాలా సంస్కారవంతులు. వారిని చూసి పెరుగుతూ నేర్చుకుంటూ ఎదిగిన వాళ్లం మేము. అలాంటి వారిలో అంజలిదేవి ఒకరు. నిజమయిన తల్లికి ప్రతీక అంజలీదేవి. ఎంత వయసు వచ్చినా భారతీయ సినిమాకు ఆమె పెద్ద ఆభరణం.’’ ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం.
ఇంత గౌరవం ఎవరికీ లభించదు
‘‘అప్పట్లో మహా నటి సావిత్రి కన్నుమూసినప్పుడు లక్షలాది మంది అభిమానులు ఆమె పార్థివదేహాన్ని చూడటానికి వచ్చారు. ఆ తరువాత అంతగా అభిమానం పొందిన నటి అంజలి దేవీనే. ఇంత గౌరవం ఏ నటికీ లభించదు. నేను నిర్మించిన నారీనారీ నడుమ మురారి చిత్రంలో అంజలి దేవి నటించారు. అలాంటి గొప్ప నటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు సీనియర్ నిర్మాత మురారి.
అంజలిదేవి ఒక అధ్యాయం
‘‘తెలుగు సినీ చరిత్రలో అంజలి దేవి ప్రస్థానం ఒక సువర్ణాధ్యాయం. సీతమ్మ అంటే అంజలినే. బాబా చరిత్ర తో మెగా సీరియల్‌గా రూపొందించినప్పుడు అందులో రెండు పాటలు రాసే అవకాశం కలిగింది. అలా ఆమెతో పరిచయం భాగ్యం కలిగింది. ఆ తరువాత నేను ప్రతిభ కోటేశ్వరరావు అబ్బాయినని తెలిసి ఎంతగానో అభినందించారు. అలాంటి ఉన్నత మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను,’’ అన్నారు సీనియర్ గీత రచయిత వెన్నెలకంటి.
సినిమానే జీవితం
‘‘80 ఏళ్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో 70 ఏళ్లుగా విశేష సేవలందించిన నటి అంజలీ దేవి ఆ తరం తారల మాటకు కట్టుబడి ఉండేవారు. సినిమానే జీవితంగా భావించేవారు. అలా సినిమా విలువ పెంచిన నటి అంజలీదేవి. 1950లో ఒకే ఏడాదిలో 13 చిత్రాల్లో నటించిన ఏకైక నటి అంజలీదేవి. నటుడు శివాజీగణేశన్, ఎస్.వీ.రంగారావు, నటి జయంతి వంటి పలువురిని సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆమెదే.’’
అన్నారు ప్రముఖగీత రచయిత భువన చంద్ర.
ఇంకా నటి సచ్చు, నటుడు శరత్‌బాబు, తమిళ నటుడు రాజేష్, డాక్టర్ సీఎంకే రెడ్డి, జెమినీ గణేశన్ కూతురు డాక్టర్ కమల సెల్వరాజ్, మంత్రులు వలర్మతి, మాధావరం మూర్తి తదితరులు అంజలీ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు.
అమ్మపేరుతో క్లినిక్
అమ్మంటే మాకు చాలా గౌరవం. ఆమె మమ్మల్ని ప్రేమగా పెంచారు. తల్లి బాధ్యతల్ని ఎప్పుడూ విస్మరించలేదు. మమ్మల్ని సినిమా వాతావరణానికి దూరంగా పెంచినా సినిమాకు అమ్మ విశేష సేవలందించడం గర్వకారణం. అదే విధంగా ప్రజలకు పలు సేవలందించారు. వాటిని కొనసాగించాలని ఆశ. నేను అమెరికాలో డాక్టరుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను. అమ్మ పుట్టపర్తి బాబా జీవిత ఇతివృత్తాన్ని సీరియల్‌గా తీసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని బాబా ట్రస్టుకే అందించారు. నేను అమెరికాలో సాయి కృప ఇంటర్నేషనల్ ట్రస్టును నెలకొల్పి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. అలాగే అమ్మపేరుతో ఒక క్లీనిక్‌ను ప్రారంభించి వైద్య సేవలందించాలనుకుంటున్నాను అని అంజలిదేవి రెండో కొడుకు డాక్టర్ నిరంజన్‌రావు తెలిపారు. అంజలీ దేవి అంతిమ యాత్రలో అశేష జనం పాల్గొన్నారు.
Advertisement
Advertisement