= త్వరలో పథకం అమల్లోకి..
= ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపాం
= అనతి కాలంలోనే అనుమతి లభించవచ్చు
= జీవన శైలి మార్పులతో కొత్త రోగాలు
= ప్రభుత్వాస్పత్రుల్లో తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం
= ఆరోగ్యంపై చైతన్యం తీసుకొచ్చేలాకార్యక్రమాలు
= ఆరోగ్య శాఖ మంత్రి ఖాదర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువనున్న) కార్డుదార్లకు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో ఏపీఎల్ కార్డుదార్లకు కూడా విస్తరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ తెలిపారు. ఇక్కడి నిమ్హాన్స్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ‘క్లినికల్ కార్డియాలజిస్ట్ అప్‌డేట్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఏపీఎల్ కార్డుదార్లకు ఆరోగ్య బీమాను విస్తరించడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించామని వెల్లడించారు.
త్వరలోనే దీనికి అనుమతి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం వల్ల మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల అనేక కొత్త రోగాలు ప్రబలుతున్నాయని అన్నారు. పరిశోధకులు, వైద్యులు ఈ రోగాలను నయం చేసే ఔషధాలను కనుక్కొనే దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామని చెబుతూ, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలను కల్పించామని, నిపుణులైన వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. అయినప్పటికీ ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ, అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత రూ.2 గుట్కాకు అలవాటు పడి ప్రాణాంతకమైన కేన్సర్ మహమ్మారి బారిన పడుతోందని వాపోయారు. వారిలో చైతన్యం తీసుకు వచ్చే కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. కాగా వైద్యులు స్వచ్ఛందంగా గ్రామీణ సేవకు సిద్ధం కావాలని ఉద్బోధించారు.
ఒక అభ్యర్థి వైద్యుడు కావాలంటే ప్రభుత్వం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో వైద్య విద్యను అభ్యసించి, గ్రామాల్లో సేవలు చేయకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న నారాయణహృదయాలయ అధ్యక్షుడు డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ ‘డిప్లొమా ఇన్ కార్డియాలజీ’ కోర్సు వల్ల వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం దీనిని గమనించి తాలూకా, జిల్లా ఆస్పత్రుల్లో కూడా వినియోగించుకోవాలని సూచించారు.