పేరుకే నిషేధం జోరుగా గుట్కా అమ్మకాలు
Published Sat, Sep 14 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
గుట్కా అమ్మకంపై నిషేధం పేరుకే పరిమితమవుతోంది. అక్రమార్కులు అండమాన్ నికోబార్ దీవుల నుంచి గుట్టుగా గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. నెలన్నర వ్యవధిలో 251 టన్నుల గుట్కా పట్టుబడడమే ఇందుకు నిదర్శనం.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా క్రయవిక్రయూలపై నిషేధం విధించింది. గుట్కా అమ్మకం, నిల్వ, ఉత్పత్తి, పంపిణీ అన్నీ నిషేధం కిందకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిషేధం ఆరు నెలల నుంచి అమలులో ఉంది. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నారు. అయితే అక్రమమార్గాల్లో టన్నుల కొద్దీ సరుకు చెన్నైకి చేరుతూనే ఉంది. అనేక సిగరెట్, కిళ్లీ బంకుల్లో గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగిపోతున్నాయి. చెన్నైలోని ఒక హార్బర్, శివారు ప్రాంతమైన ఎన్నూరులోని మరో హార్బర్ గుట్కా స్మగ్లింగ్‌కు అడ్డాగా మారాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో గుట్కా అమ్మకాలపై నిషేధం లేదు. దీంతో అక్రమార్కులు టూరిస్టు వీసాలతో అక్కడికి వెళ్లి భారీ మొత్తంలో సరుకును హార్బర్లకు బుక్ చేసి చెన్నైకి చేరవేస్తున్నారు. ఈ సమాచారం అధికారుల చెవినపడడంతో నెలరోజులుగా తనిఖీలు ముమ్మురం చేశారు. గత నెల 3న 16 టన్నులు, 12న 75 టన్నుల గుట్కా అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం రాత్రి వరకు అధికారులు అవిశ్రాంతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. విశాలమైన రోడ్లను వదులకుని ఇరుకుసందుల గుండా వస్తున్న ఒక లారీని కస్టమ్స్ అధికారులు వెంబడించారు. తండియార్‌పేట సమీపం ఎన్నూర్ హైరోడ్డు వైద్యనాథన్ బ్రిడ్జి వద్ద లారీని తనిఖీ చేశారు.
అందులో 40 కిలోల బరువుతో కూడిన అనేక గోతాం సంచుల్లో 160 టన్నుల గుట్కా దొరికింది. చెన్నై కొత్త చాకలిపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎం.అరుళ్‌దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండియార్‌పేటలోని హార్బర్ వేర్‌హౌస్ నుంచి సరుకును తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అలాగే షావుకార్‌పేటలో శుక్రవారం సాయంత్రం మరో టన్ను గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కాను నగర శివారు కొడుంగయూర్‌లో ధ్వంసం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement