
యశ్వంత్‌పూర్ : కర్ణాటకలోని రాజాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బసవేశ్వర స్కూల్‌లో ఓ విద్యార్థిపై అధ్యాపకుడు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు . కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సురేశ్ అనే అధ్యాపకుడు రవి అనే విద్యార్థిని చితకబాదాడు. తప్పుగా ప్రవర్తించాడనే నెపంతో క్లాస్‌రూమ్‌లో ఇతర విద్యార్థుల ముందటే రవిపై ఇష్టానుసారం విరుచుకుపడ్డాడు. స్కూల్ బ్యాగ్‌ను అతని పైకి విసిరాడు. రవి అక్కడి నుంచి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వెంటపడి మరి ఎక్కడపడితే అక్కడ కొట్టాడు. రవి బతిమాలిన వినిపించుకోలేదు. టీచర్ ఇలా ప్రవర్తించడంతో క్లాస్‌రూమ్‌లోని మిగతా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ఈ దృశ్యాలను క్లాస్‌రూమ్‌లోని ఓ విద్యార్థి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావడంతో సురేశ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రవిపై దాడికి పాల్పడ్డ సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.