
విక్రమ్‌కు జంటగా బిందుమాధవి
చెన్నై : ఊహించనవి జరగడమే జీవితం అంటారు. అలాగే అదృష్టం అన్నది ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేము. నిన్నటివరకు అరకొర అవకాశాలతో అదీ చిన్న హీరోలతో నటిస్తూ ఆశ నిరాశల మధ్య జీవితాన్ని ఈడ్చుకొస్తున్న నటి బిందుమాధవికిప్పుడు లడ్డులాంటి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా సియాన్ విక్రమ్‌తో డ్యూయెట్లు పాడడానికి రెడీ అయిపోతోంది. ఎస్ విక్రమ్ సరసన ఒక హీరోయిన్‌గా నటించే అవకాశం బిందుమాధవిని వరించింది. పత్తుఎండ్రదుకుళ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు.
ఈ చిత్రానికి మర్మ మనిదన్ అనే పేరును కూడా నిర్ణయించారు. అరిమానంబి చిత్రం ఫేమ్ ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహించనున్న ఈచిత్రాన్ని ఐయిన్‌గారన్ సంస్థ నిర్మించనుంది. ఇందులో ఒక హీరోయిన్‌గా కాజల్‌అగర్వాల్ ఎంపిక కాగా మరో హీరోయిన్‌గా ప్రియాఆనంద్ ఎంపికైంది. అయితే ఇప్పుడామెను తొలగించి ఆ పాత్రలో బిందుమాధవిని ఎంపిక చేశారు. ఆ చిత్ర షూటింగ్ బుదవారం లాంఛనంగా ప్రారంభించారు. అధిక భాగం షూటింగ్‌ను మలేషియా, బ్యాంకాక్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తం మీద బిందుమాధవి పెద్ద అవకాశాన్నే కొట్టేసింది. ఈ చిత్రం ఆమెను ఏ స్థాయికి చేర్చుతుందో వేచి చూడాల్సిందే.